హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): తెలుగు సాహిత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాహితీయోధుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని సీఎం కేసీఆర్ కొనియాడారు. కవి, సాహితీవేత్త సినారె 92వ జయంతి (జూలై 29) సందర్భంగా తెలుగు సాహిత్య పరిపుష్టికి ఆయన చేసిన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సినారె తన పాండిత్య ప్రతిభతో జ్ఞానపీఠ్ అవార్డును అందుకొని తెలుగుభాషా వైభవాన్ని జగద్వితం చేశారని శుక్రవారం ఒక ప్రకటనలో కొనియాడారు. తెలుగుభాషా సాహిత్యంలో పద్యకావ్యాలు, గేయకావ్యాలు, సంగీత, నృత్య రూపకాలు, గజల్స్ ఇలా ప్రతి ప్రక్రియలో తన పాండిత్యాన్ని నిరూపించుకున్న విలక్షణ కవి సినారె అని గుర్తుచేసుకున్నారు. కవిగా, సాహితీవేత్తగా, పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, సినీ గేయ రచయితగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రస్తుతించారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం తెలంగాణ కవులు, సాహితీవేత్తలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.