హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కలిపి మొత్తం 91,869 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి శనివారం తెలిపారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీట్లే 26,844 ఉన్నాయని తెలిపారు.
సీఎస్ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలో 33,180 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే సీఎస్ఈ.. ఏఐలో 14,700, సైబర్ సెక్యూరిటీలో 2,730, డాటా సైన్స్‌లో 9,480, ఐవోటీలో 1,050, ఐటీలో 5,220 సీట్లు అందుబాటులో ఉన్నాయని వీసీ తెలిపారు. గతేడాది జేఎన్టీయూ మహబూబాబాద్, పాలేరు, వనపర్తి వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా, అదనంగా మరో 1,500 సీట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ దాదాపు ముగిసినట్లేనని తెలిపారు.