హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలను మంగళవారం కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించిన పరీక్షలకు 22,712 మంది దరఖాస్తు చేసుకోగా, 20,626 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 18,829 (91.28శాతం) మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు, పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అరుణకుమారి, కో కన్వీనర్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.