హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని 2,620 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 90,316 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ బుధవారం వెల్లడించింది. ఆ దరఖాస్తులతోనే రూ.2,709 కోట్ల ఆదాయం సమకూరింది. తొలుత ఈ నెల 18 వరకు మద్యం షాపులకు 89,344 దరఖాస్తులు రాగా, అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో పాటు బంద్, పండుగల కారణంగా దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.
దీంతో ఈ నెల 21న 461 దరఖాస్తులు, బుధవారం 511 దరఖాస్తులు వచ్చినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మద్యం షాపులకు చివరిరోజున దరఖాస్తులు దాఖలు చేయడానికి అన్ని జిల్లాలకు చెందిన కౌంటర్లను ప్రొహిబిషన్ కార్యాలయంలో ఎక్సైజ్ డివిజన్ల వారీగా ఏర్పాటు చేశారు.