హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బీ – క్యాటగిరీ (యాజమాన్య) సీట్ల భర్తీలో మెరిట్ పాటించని ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా సీట్లు భర్తీ చేసిన మూడు కాలేజీలకు రూ.90 లక్షల జరిమానా విధించింది. కేఎంఐటీ కాలేజీకి రూ.70 లక్షలు, సీవీఆర్ కాలేజీకి రూ.10 లక్షలు, గురునానక్ కాలేజీకి రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించినట్టు టీఏఎఫ్ఆర్సీ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది బీ క్యాటగిరీ కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు పాల్పడే కాలేజీలపై చర్యలు తీసుకొంటామని గతంలోనే టీఏఎఫ్ఆర్సీ హెచ్చరించింది. ఇలా భర్తీ చేసే ఒక్కో సీటుకు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని తీర్మానించింది.