హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 90.40% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇది 2017లో నమోదైన దాని కంటే దాదాపు 8% అధికం. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 97.15%, ఆ తర్వాత వికారాబాద్‌లో 94.76% పోలింగ్ నమోదైంది.
అత్యల్పంగా హైదరాబాద్‌లో 82.25 శాతం నమోదైంది. తొమ్మిది జిల్లాల పరిధిలోని 137 పోలింగ్ స్టేషన్లలో ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకే ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా.. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊపందుకున్నది.
సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగియగా..అప్పటికే పోలింగ్ స్టేషన్లలో బారులు తీరిన ఓటర్లకు అవకాశం కల్పించారు. మొత్తం 29,720 మంది ఓటర్లు ఉండగా 21 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. గతంలో కంటే రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడం ఎవరికి అనుకూలం అనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ప్రక్రియను ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన 111వ పోలింగ్ బూత్‌ను అధికారులతో కలిసి సందర్శించారు.
16న తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 28 టేబుళ్ల మీద కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. కౌంటింగ్ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు రాహుల్‌శర్మ, ప్రతీక్‌జైన్, అపూర్వచౌహాన్, మయక్ మిట్టల్ వ్యవహరించనున్నారు. మొత్తం ఓట్లలో 50 శాతం పైగా సాధించినవారిని విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికీ మొదటి ప్రాధాన్య ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు.
అప్పటికీ ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఈ విధంగా ఫలితం తేలే వరకు ప్రాధాన్య క్రమంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ విధులకు హాజరయ్యే వారంతా ఈ నెల 16న ఉదయం 6 గంటల కల్లా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంకు చేరుకుని తమ గుర్తింపు కార్డులతో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావు, కాంగ్రెస్ మద్దతుతో హర్షవర్ధన్రెడ్డితోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ఎమ్మెల్యే కోటాలో ముగిసిన నామినేషన్లు
ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. మొత్తం మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. ఇందులో బీఆర్ఎస్ తరుపున దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామ్రెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా కమల అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఈ నెల 14న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 16 వరకు అవకాశం ఉన్నది. అవసరమైతే 23న పోలింగ్ నిర్వహించనున్నారు.
Print1