హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 9 వేల మంది ఓటర్లు ఇంటి వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వీరిలో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వారు, అత్యవసర సేవలందించే 13 శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. వీరికోసం ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. దీంతో ఓటింగ్‌కు 12 డీ ఫాం ద్వారా 29,267 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో ఇప్పటివరకు 9,174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొనే వారికి ఓటింగ్ ప్రక్రియను ఈ నెల 26 కల్లా పూర్తి చేయాలని ఆర్వోలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియను వీడియో రికార్డు చేస్తున్నారు. ఆ ఓట్లను భద్రపరిచి ఓట్ల లెక్కింపు రోజున మొదట లెక్కిస్తారు.
21 వరకు ఇంటి వద్ద ఓటు వేసిన ఓటర్లు