Pregnant Murder | కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలం గెర్రే గ్రామంలో ఓ నిండు గర్భిణిని మామ అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.
గెర్రే గ్రామానికి చెందిన సత్తయ్య కుమారుడు శేఖర్.. ఏడాది క్రితం రాణి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. ఆమె గర్భం దాల్చిన తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆమెపై మామ సత్తయ్య పగ పెంచుకున్నాడు. దీంతో రాణి ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న సత్తయ్య.. ఇవాళ కోడలి ఇంటికి వెళ్లాడు.
ఇక రాణి నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. ఆమెపై గొడ్డలి, కత్తితో విచక్షణారహితంగా సత్తయ్య నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న రాణిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. సత్తయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.