హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి విడతలో ఔటర్‌రింగ్ రోడ్డు పరిధిలో నాలుగు లేదా ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఒకేచోట ఇంటిగ్రేటెడ్‌గా నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
హైదరాబాద్‌లోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో రెండు, రంగారెడ్డి జిల్లాలో మూడు, మేడ్చల్ జిల్లాలో మూడు, సంగారెడ్డి, పటాన్చెరు కలిపి ఒకచోట ఇలా మొ త్తం తొమ్మిది ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిపారు.