హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి తెలంగాణా ఫైబర్‌నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు కల్పించనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు వెల్లడించారు. బేగంపేటలో గురువారం టీ ఫైబర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు టీఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్ల సహకారంతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు టీవీ చానళ్ల సదుపాయం కల్పిస్తామని తెలిపారు. టీవీ సెట్లను కంప్యూటర్ మానిటర్‌గా వినియోగించుకుని విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీ రూపొందించినట్టు చెప్పారు.
‘టీ ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసిందని పేర్కొన్నారు. మరో 7,187 పంచాయతీలు సేవలు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపార భాగస్వాములతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రెటరీ భవేశ్‌మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ పన్నేరు, పలువురు అధికారులు పాల్గొన్నారు.