హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయాలతో ఎక్సైజ్ శాఖకు రూ.2,610 కోట్లు సమకూరింది. శనివారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 87,054 దరఖాస్తులు వచ్చాయి. శనివారం వరకే గడువు ఉండటంతో అర్ధరాత్రి వరకు జిల్లాల్లో దరఖాస్తుదారులు క్యూలైన్లలో ఉన్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు. చివరిరోజు బీసీ బంద్ నిర్వహించడం, బ్యాంకుల బంద్ కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామని, గడువు పెంచాలని చాలామంది దరఖాస్తుదారులు చేసిన విజ్ఞప్తి మేరకు గడువును 23 వరకు పెంచుతున్నట్టు ఎక్సైజ్ కమిషనర్ పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం కలెక్టర్ల సమక్షంలో 23న తీయాల్సిన వైన్స్ కేటాయింపుల డ్రాను 27న నిర్వహించనున్నట్టు తెలిపారు. నిరుడు దాదాపు 1.31 లక్షల దరఖాస్తుల ద్వారా రూ. 2,620 కోట్ల ఆదాయం సమకూరింది. ‘హైడ్రా’ కూల్చివేతలు మద్యం వ్యాపారంపై ప్రభావం చూపుతాయని, కనీసం 30% మంది వ్యాపారులు దూరమవుతారని ముందే పసిగట్టిన ఎక్సైజ్ కమిషనర్ తెలివిగా దరఖాస్తు ధరలను పెంచడంతో ఆ వ్యూహం ఫలించిందని, అందుకే భారీ ఆదాయం వచ్చిందని సీఎంవో కార్యాలయం వర్గాలు వెల్లడించాయి.
మద్యం దుకాణలకు గత 21 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 46,384 వేల దరఖాస్తులు అందాయని, శనివారం ఏకంగా 40,670 వేలకుపైగా దరఖాస్తులు రావడంతో మొత్తం దరఖాస్తులు 87 వేలు దాటాయని అధికారులు తెలిపారు. 150 వైన్‌షాపుల కోసం ఏపీకి చెందిన ఓ మహిళ దరఖాస్తు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు రాగా… రంగారెడ్డిలో 82 మద్యం దుకాణాలకు అత్యధికంగా 3,500 దరఖాస్తులు అందినట్టు తెలిసింది.