హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా 5 నెలల్లోనే సుమారు రూ.85.05 కోట్లను సైబర్ క్రైం బాధితులకు రీఫండ్ చేసినట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీ)శిఖాగోయెల్ వెల్లడించారు. మార్చి-జూలై మధ్య ఈ డబ్బులు విడుదలైనట్టు తెలిపారు. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మధ్య పరస్పర సహకారంతోనే ఈ ఘనత సాధించినట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 457 సెక్షన్‌కు అనుగుణంగా ఎస్ఎస్ఏ, సీఎస్బీ రూపొందించిన ఎస్‌వోపీతో బాధితులకు డబ్బులు అందజేయగలుగుతున్నట్టు తెలిపారు. ఈ ఎస్వోపీ ఆధారంగా ఫిబ్రవరి 20, 2024న జిల్లాల న్యాయమూర్తులకు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి కోర్టులకు మొత్తం 6,840 పిటిషన్లు సమర్పించామని, వాటిలో 6,449 కేసులకు రీఫండ్ ఆర్డర్లు మంజూరు చేసి మొత్తం రూ.85.05 కోట్లు బాధితుల ఖాతాలకు మళ్లించినట్టు వివరించారు. ఇందులో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో రూ.36.8 కోట్లు రీఫండ్ చేశామని స్పష్టంచేశారు. పార్ట్‌టైమ్ జాబ్‌లు, డీమ్యాట్ అకౌంట్లు, స్టాక్ఎక్సేంజ్ల పేరుతో వచ్చే ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.