హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడటం లేదు. బాపూఘాట్ నుంచి హిమాయత్‌సాగర్ వరకు నిర్మించనున్న గాంధీ సరోవర్ కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది.
ఇందులో భాగంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండ్లగూడ, హైదర్‌గూడ, ఖ్వైలా మహ్మద్‌నగర్ గ్రామాల్లోని రూ.533.42 కోట్లు విలువచేసే 83.814 ఎకరాల రక్షణ శాఖ భూములు తీసుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు పొందింది. 83.814 ఎకరాల్లో బండ్లగూడలోని సర్వేనంబర్ 86, 87, 88, 126లోని 30.4688 ఎకరాలు, ఖ్వైలా మహ్మద్‌నగర్‌లోని సర్వే నంబర్ 250, 251, 252లోని 8.0912 ఎకరాలు, బండ్లగూడలోని సర్వే నంబర్ 91, 92, 94, 96, హైదర్‌గూడలోని సర్వే నంబర్లు 123, 124, 125లోని 39.725 ఎకరాలు అదేవిధంగా బండ్లగూడ పరిధిలోని సర్వే నంబర్ 94లోని 5.529 ఎకరాలు ఉన్నాయి. ఈ మేరకు రక్షణ శాఖ నుంచి గురువారం ఆ భూముల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనుమతులు వచ్చాయి.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు వర్కింగ్ పర్మిషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమూ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నట్టు తేటతెల్లమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిపై బా ధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, చేసిన నిద్రలన్నీ బూటకమని ఆరోపిస్తున్నారు.