Nalgonda | నీలగిరి, జూన్ 14: నల్లగొండ జిల్లా కేంద్రంలో కూతురు ఫీజు చెల్లించేందుకు వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 80 వేలు కొట్టేశారు. నల్లగొండ మండలంలోని పెద్దసూరారం గ్రామానికి చెందిన గుండె వెంకన్న కూలీగా పని చేస్తున్నాడు. ఆయన బిడ్డ నల్లగొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. కూతురి ఫీజు చెల్లించడంతోపాటు విద్యా సామగ్రిని కొనుగోలు చేసేందుకు బిడ్డ, భార్యతో కలిసి బైక్‌పై నల్లగొండకు వచ్చాడు.
ఎల్ఐసీ నుంచి వచ్చిన చెక్కును సెంట్రల్ యూనియన్ బ్యాంకులో జమ చేసి, అందులోంచి రూ. 80 వేలు డ్రా చేశాడు. డబ్బులను బైక్ డిక్కీలో పెట్టి ప్రకాశం బజారులోని ఓ షాపులోకి కాలేజీ బ్యాగ్ కొనేందుకు వెళ్లాడు. బ్యాంకు నుంచి అతడిని అనుసరిస్తూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు గొడుగును అడ్డుగా పెట్టి బైక్ డిక్కీలాక్ను పగులగొట్టారు. అందులో ఉన్న డబ్బులు కొట్టేసి పరారయ్యారు. షాపు నుంచి బయటకు వచ్చిన వెంకన్న బైక్ డిక్కీ తెరిచి ఉండడం, నగదు కనిపించకపోవడంతో భోరున విలపించాడు. వెంకన్న కూతురు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శంకర్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులను పట్టుకుంటామని చెప్పారు.