Artisans | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వేతన సవరణపై అసంతృప్తితో మంగళవారం నుంచి ప్రారంభించిన ఆర్టిజన్ల సమ్మె ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా,పంపిణీపై సమ్మె ప్రభావం ఏమీ లేదని, రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి నివేదికలు వచ్చాయి. సమ్మె నేపథ్యంలో విద్యుత్తుసంస్థల ఉన్నతాధికారులు విద్యుత్తుసౌధలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
జెన్కో విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు నూటికి నూరు శాతం, ట్రాన్స్‌కోతోపాటు రెండు డిస్కంలలో పనిచేస్తున్న ఆర్టిజన్లు నూటికి 80 శాతం మంది తమ విధులకు హాజరైనట్టు తెలిసింది. విద్యుత్తుసంస్థల్లో అత్యవసర సర్వీసుల చట్టం ఎస్మా అమలులో ఉన్నదని ముందుగానే ఆర్టిజన్లందరికీ తెలిపారు. ఈ క్రమంలో చట్ట వ్యతిరేక సమ్మెలో పాల్గొన్నట్టు గుర్తించిన సుమారు 200 మంది ఆర్టిజన్లను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 24 గంటల విద్యుత్తు సరఫరాను భగ్నం చేసే ఏ దుశ్చర్యలనూ ఉపేక్షించబోమని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. బుధవారం ఉదయంలోగా విధులకు హాజరుకాని ఆర్టిజన్లు అందరినీ సర్వీసు నుంచి తొలగిస్తామని ప్రకటించారు.
సమ్మెలో ఉన్న ఆర్టిజన్ల తొలగింపు
చట్ట విరుద్ధమైన సమ్మెలో పాల్గొనటంతోపాటు.. సహోద్యోగులను సమ్మెకు పురిగొల్పిన కారణంగా తెలంగాణ విద్యుత్తు ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్82) ప్రధాన కార్యదర్శి ఎస్ సాయిలును ఆర్టిజన్ గ్రేడ్-2 ఉద్యోగం నుంచి తొలగిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సాయిలు ట్రాన్స్‌కోలో సివిల్ విభాగంలో గ్రేడ్-2 ఆర్టిజన్‌గా ఉన్నారు. యూనియన్ హెల్త్ సెక్రటరీ ఆర్టిజన్ గ్రేడ్-1 జే శివశంకర్ కూడా సమ్మెలో పాల్గొనటంతోపాటు సహోద్యోగులను సమ్మెకు ప్రేరేపించారనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఎస్పీడీసీఎల్ సీజీఎం (హెచ్ఆర్డీ) ఉత్తర్వులు జారీచేశారు.