హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): కొత్తగా టీఎస్ఆర్టీసీ కుటుంబంలో చేరిన కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌లో బుధవారం టీఎస్ఆర్టీసీకి చెందిన 80 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం, సంస్థ ఎండీ సజ్జనార్ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారికి నియామకపత్రాలను అందజేశారు. కారుణ్య నియామకం కింద నియమితులైన 80 మంది కానిస్టేబుళ్లలో 47 మంది పురుషులు, 33 మంది మహిళలు ఉన్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ 8వ బెటాలియన్‌లో పోలీస్‌శాఖ సహకారంతో వీరికి ఒక నెల శిక్షణ ఇచ్చారు. వారంతా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద 1,700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. తాజాగా 813 మంది నియామక ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి అవుతుందని పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. కొత్త రక్తంతో సంస్థ మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. శిక్షణలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఎం శిరీష (బెస్ట్ ఆల్‌రౌండర్), సంకీర్తన (బెస్ట్ ఇండోర్), శిరీష, రిత్విక్ (బెస్ట్ ఔట్‌డోర్)లకు ట్రోఫీలను అందజేశారు. పాసింగ్ ఔట్ పరేడ్‌లో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవీందర్, ఈడీ (అడ్మిన్) కృష్ణకాంత్, 8వ బెటాలియన్ కమాండెంట్ సన్నీ, అదనపు కమాండెంట్ నారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు.