అయిజ/పెంబి/సత్తుపల్లి/గుండాల/కారేపల్లి, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం పడిన పిడుగుపాట్లకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఇందులో నలుగురు రైతులు, ముగ్గురు వ్యవసాయ కూలీలు, మరో వ్యక్తి ఉన్నారు. కాగా మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనలు నిర్మల్, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎంగ్లాపూర్లోని ఓ పొలంలో ముగ్గురు రైతులు అల్లెపు ఎల్లవ్వ, అల్లెపు ఎల్లయ్య, బండారు వెంకటి పనులు చేసుకుంటున్నారు. భారీ వర్షం కురవడంతో చేనులోని మంచెపైకి వెళ్లారు. పిడుగు పడటంతో మరణించారు. జోగుళాంబ గద్వాల జిల్లా భూంపురంలో రైతు తిమ్మప్ప పొలంలో సీడ్పత్తి పనికి భూంపురం, పులికల్ గ్రామాలకు చెందిన 20 మంది కూలీ పనులకు వెళ్లారు.
వర్షం కురడవంతో తాటి, వేప చెట్ల కిందకు వెళ్లారు. తాటిచెట్టుపై పిడుగు పడింది. దీంతో భూంపురంవాసులు సర్వేశ్ (19), పార్వతి (38), పులికల్కు చెందిన సౌభాగ్య (38) మృతి చెందారు. రాజు, జ్యోతి, కావేరికి, తిమ్మప్పకు గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీమలగూడేనికి చెందిన నర్సయ్య(55) చేనుకు మంగళవారం రాత్రి కాపలా వెళ్లాడు. పిడుగుపడటంతో నర్సయ్య మరణించాడు. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మహేశ్(31) గ్రామ శివారులో పశువులను మేపుతుండగా పిడుగు పడటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు సత్తుపల్లి దవాఖానకు తరలించగా మహేశ్ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా కొమ్మినేపల్లి సమీపంలోని మిరప తోటలో పిడుగుపడటంతో రైతు బావుసింగ్కు తీవ్ర గాయాలయ్యాయి.