కామారెడ్డి, మార్చి 27: కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో బుధవారం గణిత పరీక్ష ప్రశ్నలు లీక్ చేసిన కేసులో పోలీసులు 8 మందిని అరెస్టుచేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఎస్పీ రాజేశ్చంద్రం గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి వాటర్ సప్లయ్చేసే వ్యక్తితో కొన్ని ప్రశ్నలు పేపర్‌పై రాసి బయట ఉన్న తన తండ్రికి పంపించాడు. ఆ పేపర్‌ను విద్యార్థి తండ్రి కారోబార్కు ఇచ్చి జవాబులు తేవాలని కోరగా ఆయన అక్కడ ఉన్న ఓ విలేకరికి పంపించాడు.
అతడి నుంచి యూట్యూబ్ రిపోర్టర్‌కు రాగా అతడు మరో రిపోర్టర్‌కు వాట్సాప్‌లో పంపించాడు. అతడు ఆ పేపర్‌ను క్లిప్పింగ్గా మార్చి డిజిటల్ మీడియా గ్రూప్‌లో పోస్టుచేశారు. ఇది వైరల్‌గా మారడంతో ఫ్లయింగ్ స్కాడ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మాల్‌ప్రాక్టీస్‌కు యత్నించిన 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఓ యూట్యూబ్ చానల్ విలేకరి, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఉన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.