Narayanpet | నారాయణపేట : నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళా కడుపులో నుంచి ఏకంగా 8 కిలోల బరువున్న కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. నారాయణపేట మండల పరిధిలోని పేరపళ్ల గ్రామానికి చెందిన 45 ఏండ్ల లక్ష్మి అనే మహిళ కడుపు నొప్పితో బాధ పడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు డాక్టర్లు స్కానింగ్స్ తీయగా.. కడుపులో భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాధిత మహిళకు సర్జరీ నిర్వహించి కణితిని తొలగించారు. కణితి బరువు 8 కిలోలు ఉంటుందని వైద్యులు తెలిపారు. తన ప్రాణాలను కాపాడిన వైద్యులకు బాధిత మహిళ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ ఆపరేషన్లో వైద్యులు రంజిత్, సవజన్య, దీపిక, నర్సులు విజయలక్ష్మి, సుజాత పాల్గొన్నారు.