హైదరాబాద్: లగచర్ల దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కొడంగల్ పోలిస్టేషన్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరందరిని సాయంత్రం వరకు రిమాండ్ చేసే అవకాశం ఉంది. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ (క్లస్టర్) ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా ఈనెల 11న ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్-కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ విజయకుమార్, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై రైతులు, గ్రామస్థులు రాళ్లు, కర్రలతో దాడులు చేసిన విషయం తెలిసిందే.