కామారెడ్డి, జూలై 6: పెండ్లికి ముందే వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్నది ఆమె. కడుపులోని పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు.. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు.. వెరసి నవజాత శిశువును విక్రయించిన కేసులో ప్రభుత్వ వైద్యుడు సహా ఎనిమిది మందిని కామారెడ్డి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలను పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. జిల్లాలోని చిట్యాలకు చెందిన లావణ్యకు, రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన మహేశ్‌తో గత ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే గర్భవతి అయిన లావణ్య భర్తకు తెలియకుండా గర్భాన్ని తీయించుకోవాలనుకున్నది.
కామారెడ్డి శ్రీరామనగర్ కాలనీలోని సమన్విత దవాఖానలో మేనేజర్ ఉదయ్‌కిరణ్ ద్వారా వైద్యులు ఇట్టం నడిపి సిద్ధిరాములు, ప్రవీణ్‌కుమార్‌ను ఏప్రిల్‌లో సంప్రదించింది. అప్పటికే ఎనిమిది నెలల గర్భిణి అయిన ఆమె.. తనకు బిడ్డ వద్దని చెప్పగా, కాన్పు చేసేందుకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 11న ఆడబిడ్డను ప్రసవించింది. ఒప్పందం ప్రకారం లావణ్య మేనేజర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.80 వేలు, నగదుగా రూ.50 వేలు చెల్లించి తప్పుకున్నది. శిశువును సదరు డాక్టర్లు మరో దవాఖానలో వైద్యం చేయించారు. అనంతరం డాక్టర్ సిద్ధిరాములు తనకు పరిచయస్తుడైన రాజంపేటకు చెందిన బాలకిషన్ ద్వారా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన భూపతి శిశువును తీసుకునేందుకు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
భార్య లావణ్యపై మహేశ్‌కు అనుమానం రావడంతోపాటు దవాఖానలో కాన్పు అయిందని తెలిసిన వ్యక్తులు సమాచారం ఇచ్చారు. మహేశ్ విచారించగా బాగోతం బయటపడిం ది. దీంతో ఆయన 1098కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కామారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రంగంలోకి దిగారు. శిశువును విక్రయించినట్టు తేలడంతో చైల్డ్ ఆఫీసర్ స్రవంతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు డాక్టర్లు సిద్ధిరాములు, ప్రవీణ్‌కుమార్, ఉదయ్‌కిరణ్, బాలరాజు, తల్లి లావణ్య, బాలకిషన్, దేవయ్యతోపాటు చిన్నారిని కొనుగోలు చేసిన భూపతిని అరెస్టు చేశారు.