హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కోర్సుల్లో ఈసారి 90% కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. 88,053 సీట్లకు 79,313 సీట్లు నిండాయి. శనివారం ఎప్‌సెట్ మొదటి విడత మాక్ సీట్లను కేటాయించారు. 89,785 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, 88,062 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. మాక్ సీట్ల కేటాయింపు తర్వాత 8,740 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇది తాత్కాలిక కేటాయింపు మాత్రమే. విద్యార్థులు ఈ సీట్ల పట్ల సంతృప్తికరంగా లేకపోతే ఈ నెల 7వ తేదీలోగా ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఈ నెల 10లోపు తొలి విడత అలాట్మెంట్ ఉంటుంది.
డిగ్రీ ఫస్టియర్‌లో 1.38లక్షల సీట్లు భర్తీ
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్‌లో ఇప్పటి వరకు 1.38లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) రిపోర్టింగ్ గడువు శనివారంతో ముగిసింది. మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత ఆన్లైన్లో 1,17 658 మంది, ఆఫ్‌లైన్‌లో 21,024 చొప్పున మొత్తంగా 1,38,692 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ నెలలోనే ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగనున్నది. ఆ తర్వాత సీట్లు రాని వారు డిగ్రీ వైపు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 708 కాలేజీల్లో 3,70,509 సీట్లకు ప్రస్తుతం 1.38లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 1.56,531 మంది సెల్ఫ్‌రిపోర్ట్ చేసినా.. కాలేజీల్లో రిపోర్ట్ చేసిన వారు 1,38,692 మంది మాత్రమే కావడం గమనార్హం. అంటే 17,839 మంది సీట్లు వదులుకున్నారు.