హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సహా 5 రాష్ర్టాల శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా పెరగగా.. రాజస్థాన్లో తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి 2018లో కేవలం 13 మంది మహిళలు ఎన్నికవగా.. ఇప్పుడు ఆ సంఖ్య 19కి (14 నుంచి 21 శాతానికి) పెరిగింది. ఇది ఆ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే అత్యధికం. 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో మహిళల సంఖ్య 6 నుంచి 10కి, మధ్యప్రదేశ్ (మొత్తం 230 సీట్లు)లో 21 నుంచి 27కు, మిజోరం (మొత్తం 40 సీట్లు)లో ఒకటి నుంచి రెండు పెరిగింది. కానీ, మొత్తం 200 సీట్లున్న రాజస్థాన్ అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 24 నుంచి ఇరవైకి తగ్గింది. వాస్తవానికి రాజస్థాన్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఎప్పుడూ 15 శాతానికి మించలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పెద్దలే అధికం
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల సగటు వయస్సు గతంతో పోల్చితే మరింత పెరిగింది. తెలంగాణ కొత్త శాసనసభలో ఎమ్మెల్యేల సగటు వయసు 56 ఏండ్లుగా ఉన్నది. మన రాష్ట్రం లో 55 ఏండ్లు పైబడిన ఎమ్మెల్యేల నిష్పత్తి 2018లో 39 శాతం ఉండగా.. ఈసారి ఆ నిష్పత్తి 60 శాతానికి పెరిగింది. మధ్యప్రదేశ్ నూతన అసెంబ్లీలో 50% మంది ఎమ్మెల్యేలు 55 ఏండ్లు పైబడినవారే. ఆ శాసనసభలో 55 ఏండ్లు పైబడినవారు 2008లో 21% మంది, 2013లో 30% మంది, 2018లో 38% మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్ కొత్త అసెంబ్లీలో 55 ఏండ్లు పైబడిన ఎమ్మెల్యేల నిష్పత్తి 41 శాతంగా ఉన్నది. 2008 లో ఈ నిష్పత్తి 16 శాతం, 2013లో 29 శాతం, 2018లో 40 శాతంగా ఉన్నది. కానీ, రాజస్థాన్ శాసనసభలో ఈసారి 55 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న ఎమ్మెల్యేల నిష్పత్తి 48 నుంచి 46 శాతానికి తగ్గడం గమనార్హం.