హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : చిన్న వయసులోనే పెద్ద పెద్ద జీవిత లక్ష్యాలను ఛేదిస్తున్నారు కొందరు యువత. అందులో ముఖ్యంగా మహిళలు ఐపీఎస్‌పై (IPS) ఆసక్తితో ఎంతో శ్రమకోర్చి అనుకున్నది సాధిస్తున్నారు. ఇటీవల 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల శిక్షణ పూర్తి కాగా 25 ఏండ్ల లోపువారు సుమారు 21మంది యువతే ఉన్నట్టు జాతీయ పోలీసు అకాడమీ (NPA) డైరెక్టర్ అమిత్‌గార్గ్ వెల్లడించారు. బుధవారం ఎన్పీఏలో 77వ బ్యాచ్ ఐపీఎస్‌లను మీడియాకు పరిచయం చేసిన అనంతరం పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఈసారి ఐపీఎస్ సాధించిన వారిలో 25 ఏండ్ల లోపు వాళ్లు పురుషులు 14మంది, ఏడుగురు మహిళలు కలిపి మొత్తం 21మంది ఉన్నట్లు వివరించారు. 25-28 ఏండ్ల లోపు 87మంది ఉండగా వారిలో మహిళలు 37, పురుషులు 50మంది ఉన్నట్టు తెలిపారు. ఇక 28 ఏండ్లు పైబడిన వారు మొత్తం 66మంది ఉండగా వారిలో 18మంది మహిళలు.. 48మంది పురుషులు ఉన్నారని చెప్పారు. 174మంది బ్యాచ్‌లో మహిళల 62, పురుషులు 112 మంది ఉన్నట్లు తెలిపారు.
ఏటేటా ఐపీఎస్‌కు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ అనుభవం ఉన్నవాళ్లు 88మంది ఉండగా వారిలో మహిళలు 24మంది, పురుషులు 64మంది ఉన్నారు. ఎలాంటి ఉద్యోగానుభం లేకుండా కొత్తగా ఐపీఎస్ సాధించిన వారు 86మంది ఉండగా అందులో పురుషులు 48మంది, మహిళలు 38మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఇంజినీరింగ్ చదువుకున్న 87మంది ఐపీఎస్ సాధించి టాప్‌లో ఉండగా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి 36, ఆర్ట్స్-29, ఎంబీబీఎస్-8, కామర్స్-8, లా చేసిన వారు ఆరుగురు ఉన్నారు. ఈ నెల 17న నిర్వహించే దీక్షాంత్ పరేడ్ కమాండర్‌గా తమిళనాడు క్యాడర్‌కు చెందిన అంజిత్ ఏ నాయర్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. తమ వద్ద శిక్షణ పొందిన ట్రైనీలకు విలువలతో కూడిన శిక్షణ ఇచ్చామని ఆయన చెప్పారు. కొందరు ట్రైనీలుగానే స్టేషన్లలో సెటిల్మెంట్లు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. శిక్షణ పొందిన వారిలో 23మంది ఐఏఎస్ రావడంతో అటువైపు వెళ్లారని తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌వర్మ పాల్గొన్నారు.
తెలంగాణకు నలుగురు కేటాయింపు
77వ ఐపీఎస్ బ్యాచ్‌లో తెలంగాణకు 4 పోస్టులు కేటాయించారు. కాగా, వీరిలో హోం కేడర్‌కు చెందిన వారు ఎవరూ లేరు. మధ్యప్రదేశ్‌కు చెందిన అయాషా ఫాతిమా, మంధరే సోహం సునీల్(మహారాష్ట్ర), మనీషా నెహ్ర(రాజస్థాన్), రాహుల్ కాంత్(ఝార్ఖండ్)ను తెలంగాణకు నియమించారు. కాగా ఈసారి తెలంగాణ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఐపీఎస్ చివరి వరకూ నిలిచారు. ఆ ఇద్దరిని కూడా ఇతర రాష్ర్టాలకు కేటాయించారు. వారిలో అభిజిత్ పాండేను మణిపూర్ కేడర్‌కు, ఎస్ దీప్తి చౌహాన్‌ను ఉత్తరప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. ఈసారి అత్యధికంగా యూపీ నుంచి 35మంది ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి 19, ఢిల్లీ నుంచి 17, బిహార్ నుంచి 12, హర్యానా నుంచి 10మంది ఎంపికయ్యారు.