హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులపై 777 కోడ్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. ఇందులో కొన్ని ఫిర్యాదులు ఉండగా, మరికొన్నింటిని సుమోటోగా తీసుకొని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, బహుమతులు, హెల్మెట్లు, చీరలు, డబ్బులు పంపిణీ చేయడం, స్థానికంగా అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం లాంటి కేసులున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొండా సురేఖ, పీ సుదర్శన్‌రెడ్డి, వొడితెల ప్రణవ్‌రావు, కేపీ వివేకానంద, పుట్ట మధు, కవ్వంపల్లి సత్యనారాయణ, దొంతి మాధవరెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, రాంచంద్రునాయక్, మల్రెడ్డి రంగారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి, మధు యాష్కి, కంది శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, వడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మైనంపల్లి రోహిత్‌రావు తదితరులపై కేసులు అయ్యాయి.