హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో ఇవి ప్రారంభమవుతాయని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సోమవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. మద్దతు ధరకంటే తక్కువకు కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించాలని శాంతికుమారి ఆదేశించారు. కోడ్ అమలుపై ఆమె సచివాలయంలో సమీక్షించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.