హైదరాబాద్/సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): పెట్టుబడి, ఉపాధి కల్పన పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ రూ. 712 కోట్లను ఉగ్రవాదుల ఖాతాల్లోకి మళ్లిస్తున్న సైబర్ ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రట్టు చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. దుబాయ్, చైనా కేంద్రంగా జరుగుతున్న ఈ మోసాల్లో ఉగ్ర మూలాలు కూడా ఉండడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. శనివారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సైబర్‌క్రైం డీసీపీ స్నేహామెహరా, ఏసీపీ ప్రసాద్‌లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. చిక్కడపల్లికి చెందిన శివకుమార్‌కు టెలిగ్రామ్ యాప్ ద్వారా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ట్రావెలింగ్-బూస్ట్-99.కామ్ నుంచి పార్ట్‌టైం జాబ్ అవకాశం వచ్చింది. టాస్కులకు రేటింగు ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించొచ్చన అశతో విడతలవారీగా రూ28 లక్షల వరకు పెట్టబడి పెట్టి మోసపోవడంతో మార్చిలో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు మరో 48 ఖాతాల్లోకి బదిలీ అయినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. వాటిని పరిశీలిస్తే రూ. 584 కోట్లు జమ అయినట్టు తేలింది. వాటిలో ఒకటి రాధిక మార్కెటింగ్ కంపెనీ పేరుతో ఉండడంతో పోలీసులు కూపీ లాగారు. నగరానికి చెందిన మహ్మద్ మునావర్ రాధిక మార్కెటింగ్ కంపెనీ అనే బోగస్ కంపెనీ పేరుతో నకిలీ ఖాతాను తెరిచినట్లు తేలింది. మునావర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అరుల్దాస్, షా సుమైర్, షమీర్ఖాన్లతో కలిసి మునావర్ మూడు నెలల పాటు లక్నోకు వెళ్లి మనీశ్, వికాస్, రాజేశ్‌ల సహాయంతో 33బోగస్ కంపెనీలను ఏర్పాటు చేయడంతోపాటు వాటి పేర్ల మీద 65బ్యాంక్ ఖాతాలను తెరిచినట్టు పోలీసులు గుర్తించారు. వాటిలో ఆన్లైన్ మోసాల ద్వారా రూ.128కోట్లు జమ అయినట్టు గుర్తించారు.
క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాలకు
అహ్మదాబాద్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ వ్యాలెట్ నిర్వాహకులు ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి చైనాకు చెందిన లీలౌ, నాన్యె, కెవి జూన్ తదితరులకు అనుచరులుగా వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్ మోసాల ద్వారా వివిధ ఖాతాల్లో జమ అయిన సొమ్మును దుబాయ్‌లో స్థిరపడిన ఆరిఫ్, అనాస్, ఖాన్‌సాబ్, పియూష్ శైలేశ్లు క్రిప్టో కరెన్సీగా మార్చి చైనా, దుబాయ్‌లోని ఇతర నిందితులకు చేరవేస్తారు. ఇందుకోసం వారు ప్రతి లావాదేవీపై 2-3శాతం కమీషన్ తీసుకుంటారు. క్రిప్టో కరెన్సీ ద్వారా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకి డబ్బులు బదిలీ అయినట్టు గుర్తించామని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ఆన్లైన్ మోసంలో దేశవ్యాప్తంగా 15వేల మంది బాధితులు ఉండగా మొత్తం రూ.712కోట్లు దేశం నుంచి దుబాయ్, చైనాతో పాటు ఉగ్రవాద సంస్థల ఖాతాల్లోకి వెళ్లినట్లు వివరించారు. ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి, నయీముద్దీన్, గగన్‌కుమార్ సోని, పర్వీజ్ అలియాస్ గుడ్డు, షమీర్‌ఖాన్, మహ్మద్ మునావర్, షా సుమైర్, అరుల్దాస్లను అరెస్టు చేసి, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10,54,89,943ను ఫ్రీజ్ చేసినట్టు తెలిపారు. నిందితుల్లో మరికొందరు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ఉగ్రమూలాలు కూడా ఉండడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు సమాచారం అందించినట్టు వివరించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన సైబర్‌క్రైం ఏసీపీ ప్రసాద్, ఇన్స్పెక్టర్ గంగాధర్‌తో పాటు సైబర్ క్రైమ్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.