హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : సక్రమంగా వేతనాలు అందక అంగన్వాడీ సిబ్బంది విలవిల్లాడుతున్నారు. ఇండ్ల కిరాయిలు, పిల్లల స్కూల్, కాలేజీల ఫీజులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మంత్రి, సంబంధిత అధికారులకు విన్నవించినా బుట్టదాఖలవుతున్నాయని వాపోతున్నారు. నాడు ఓట్ల కోసం అంగన్ వాడీలకు వరాలజల్లు కురిపించిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి రాగానే విస్మరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 70 వేల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఫస్ట్ తారీకున వేతనాలు అందిస్తామని, టీచర్ల వేతనాలను రూ.13,600 నుంచి రూ.18 వేలు, హెల్పర్లకు రూ.8,500 నుంచి రూ.13 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. కానీ, ఇప్పుడు వేతనాలు పెంచడం దేవుడెరుగు.. కనీసం ఉన్నవి సక్రమంగా ఇవ్వడం లేదని సిబ్బంది ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నోసార్లు విన్నవించాక మార్చి నెలకు సంబంధించిన వేతనాన్ని మే 4న ఖాతాల్లో జమచేశారని, ఏప్రిల్ వేతనాన్ని ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆందోళనకు సన్నద్ధం..
ప్రతినెలా వేతనాలను ఆలస్యం చేస్తుండటంపై అంగన్వాడీ సిబ్బంది మండిపడుతున్నారు. ఇక సర్కార్‌తో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించామని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(మినీ) రాష్ట్ర అధ్యక్షురాలు స్పష్టం చేశారు. వెంటనే ఏప్రిల్ వేతనాలను విడుదల చేయాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమని హెచ్చరించారు.