హైదరాబాద్, మార్చి 9 : కొత్త ఉద్యోగాల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.7 వేల కోట్ల వరకు అదనంగా భారం పడనున్నది. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాల ఖర్చు ఏడేండ్లలోనే మూడు రెట్లు పెరిగింది. 2013-14లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు కలిపి దాదాపు రూ.18 వేల కోట్లు వెచ్చించారు. తెలంగాణ ఏర్పాటైన వెంటనే సీఎం కేసీఆర్ ఉద్యోగులందరికీ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత 43 శాతం పీఆర్సీని ప్రకటించారు. సీపీఎస్ ఉద్యోగులకు అదనపు డెత్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించారు. ప్రత్యేకంగా ఆరోగ్య పథకాన్ని రూపొందించి, అమలు చేస్తున్నారు. ఇందుకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నారు. ఆ తర్వాత అంగన్వాడీలు, వీఆర్ఏలు, వీవోఏలు, జలమండలి ఉద్యోగులు ఇలా ఒక్కో వర్గం ఉద్యోగులకు పరిస్థితులకు అనుగుణంగా వేతనాలు పెంచారు. గతేడాది ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులతోపాటు మిగతావారికీ 30 శాతం పీఆర్సీ ప్రకటించి అమలు చేస్తున్నది. దీంతో వేతన బడ్జెట్ రూ.54 వేల కోట్లకు చేరింది. అంటే.. ఏడేండ్లలోనే వేతన బడ్జెట్ సుమారు మూడు రెట్లు పెరిగింది. పెన్షన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.11 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. కొత్త ఉద్యోగాల భర్తీతో వేతన బడ్జెట్ రూ.58-60 వేల కోట్లకు చేరే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.