అయోధ్య, జూలై 7: అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో విరాళాల లెక్కింపు సమయంలో చోరీ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 27 నుండి జూన్ 5 మధ్య రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్‌లో విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న కొందరు సిబ్బంది కరెన్సీ నోట్ల కట్టలు, చిల్లర నగదును తమ బట్టలు, జేబులు, బూట్లు, ఇతర రహస్య ప్రదేశాలలో దాచిపెడుతున్నట్లుగా పదేపదే నమోదైందని సిట్ పేర్కొంది. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజి ద్వారా ఈ కాలంలో దాదాపు 70 చోరీ ఘటనలను సిట్ తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. లెక్కించిన నగదు మొత్తానికి, బ్యాంకుల్లో జమ చేసిన డబ్బుకు మధ్య ఉన్న వ్యత్యాసాల ఆధారంగా ఏప్రిల్ 27కు ముందే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చని నివేదికలో సిట్ తెలిపింది. అయితే అంతకుముందు సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం వల్ల అటువంటి సంఘటనల పూర్తి స్థాయిని నిర్ధారించడం తమకు సాధ్యం కాలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు.
భద్రతా వైఫల్యాల వల్లే..
ట్రస్ట్‌కు చెందిన ఎస్వోపీల ప్రకారం నిర్దేశించిన అనేక భద్రతా చర్యలను సరిగా అమలు చేయలేదని లేదా పాటించలేదని సిట్ గుర్తించింది. లెక్కింపు ప్రక్రియ సమయంలో పారదర్శకతలేమి, భద్రతను నిర్ధారించడానికి ఉద్దేశించిన సిబ్బందిని తనిఖీ చేయడం, బయోమెట్రిక్ హాజరు, లెక్కింపు ప్రాంతంలోకి వ్యక్తిగత వస్తువులను తీసుకురావడంపై ఆంక్షలు, సీసీటీవీ లోపాలు ఇందులో ఉన్నాయి. విరాళంగా వచ్చిన వెండి ఇటుకలు, ఇతర విలువైన కానుకలకు సంబంధించిన ఆరోపణలను ధృవీకరించలేమని సిట్ పేర్కొంది.సీసీటీవీ దృశ్యాలు, ఆర్థిక పత్రాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఆరుగురు వ్యక్తుల ప్రమేయాన్ని సిట్ ప్రాథమికంగా గుర్తించింది.
2,800 కానుకలూ భద్రంగా ఉన్నాయి
కనిపించకుండా పోయాయని ఆరోపణలు వస్తున్న వేళ కొన్ని విలువైన వస్తువులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం ప్రదర్శించింది. ఆలయానికి అందచేసిన ప్రతి విరాళం, కానుకను రికార్డు చేస్తామని ట్రస్టు తెలియచేసింది. సోమవారం నాడిక్కడ సుదీర్ఘ ట్రస్ట్ కమిటీ సమావేశం అనంతరం ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయానికి విరాళంగా వచ్చిన ఒక బంగారు రామాయణం, స్వామివారి పాదుకలు, ఒక హారం, కాకభుశుండి విగ్రహంతో సహా ఐదు అత్యంత విలువైన వస్తువులను ఆయన ప్రదర్శించారు. ఆలయానికి విరాళంగా అందచేసిన దాదాపు 2,800 వస్తువుల వివరాలు ఇందులో ఉన్నాయని పేర్కొంటూ ట్రస్ట్ తన వస్తువుల జాబితా రిజిస్టర్‌ను కూడా సమర్పించింది. చోరీ అంటే చోరీయే అని వ్యాఖ్యానిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసును విచారిస్తోందని, పరారీలో ఉన్న వారితోసహా ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి శిక్షించాలని తాము కోరుకుంటున్నట్లు గోవింద్ దేవ్ గిరి పేర్కొ న్నారు. ట్రస్ట్ తదుపరి సమావేశం జూలై 22న జరగనున్నది.
అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: చంపత్‌రాయ్
అయోధ్యలోని రామ మందిర విరాళాల చోరీ కేసు, తనపై వచ్చిన ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మంగళవారం మొదటిసారి మౌనం వీడారు. చాలామంది తనపైన నిరాధార ఆరోపణలు చేశారని, కాని తాను మౌనాన్ని పాటించానని ఆయన చెప్పారు. పలువురు లేవనెత్తిన అంశాలపై తాను ఒక్కొక్కటిగా సమాధానం ఇస్తానని, పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాయ్ చెప్పారు. ప్రచారక్‌గా తన జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిదని రామ భక్తులను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రామ మందిరానికి సంబంధించిన విరాళాల చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.