యాదాద్రి భువనగిరి/హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని దవాఖానలో బుధవారం రాత్రి 7 నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, జనరేటర్ మొరాయింపు నేపథ్యంలో ‘దవాఖానలకూ కరెంట్ కోతలు’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీనికి జిల్లా యంత్రాంగం స్పందించింది.
ఇంజినీరింగ్, విద్యుత్తు, ఆరోగ్య శాఖ అధికారులు దవాఖానను సందర్శించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జనరేటర్ గదిని పరిశీలించి మరమ్మతులు చేయించారు. త్వరలోనే ఆటోమెటిక్ జనరేటర్ అందుబాటులోకి తేవాలని కలెక్టర్ హన్మంతు కే జెండగే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ తదితర ప్రధాన దవాఖానల్లో కరెంట్ సమస్యలపై కూడా ఆరా తీశారు.
వేర్వేరుగా శాఖల నివేదిక
భువనగిరి జిల్లా దవాఖానలో బుధవారం రాత్రి విద్యుత్తు లేక రోగులు అవస్థలుపడ్డ ఘటనపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేవలం 7 నిమిషాలు మాత్రమే దవాఖానలో చీకటి ఉన్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ చిన్నానాయక్ పేర్కొన్నారు. ఘటనకు గల కారణాలను వివరిస్తూ నివేదిక అందించాలని హెల్త్, విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆదేశాలు జారీ చేయడంతో.. సూపరింటెండెంట్, జిల్లా విద్యుత్తు అధికారులు వేర్వేరుగా నివేదికలను అందజేశారు.
దవాఖానలో రాత్రి 9:05 నుంచి 9:12 గంటల మధ్య 7 నిమిషాలు మాత్రమే జనరేటర్ పనిచేయలేదని, ఆ తర్వాత వెంటనే పునరుద్ధరించామని ‘నమస్తే తెలంగాణ’తో చిన్నానాయక్ తెలిపారు. త్రీఫేజ్ లైన్ ట్రిప్ కావడంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగిందని, రాత్రి 8:45 నుంచి రాత్రి 9:25 వరకు కరెంట్ పోయిందని విద్యుత్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సైతం ట్వీట్ చేశారు. కాగా.. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి గురువారం జిల్లా దవాఖానను సందర్శించారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయంపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో ఒక్కసారి కరెంట్ పోతేనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.