హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ఏడు వేలకు పైగా జన్యు సంబంధ వ్యాధులను గుర్తిస్తే, వీటితో మనదేశంలో ఏడు కోట్ల మంది బాధపడుతున్నారని సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) సెక్రటరీ రాజేశ్గోఖలే అన్నారు. పుట్టుకతో వచ్చే ఈ వ్యాధులను గర్భంలో పిండ దశలోనే గుర్తించి భావి తరాలను కాపాడుకొనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ (సీడీఎఫ్‌డీ)లో పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిజార్డర్ మిషన్ ప్రోగ్రాంను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. డీబీటీ, సీడీఎఫ్‌డీ వంటి 15కు పైగా సంస్థలు జన్యుపరమైన వ్యాధులు, చిన్న పిల్లల్లో జన్యు మార్పిడి, వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధుల నియంత్రణపై చేస్తున్న పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మందిలో జన్యు సంబంధిత వ్యాధులు ఉన్నాయన్నాయని సీడీఎఫ్‌డీ డైరెక్టర్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తంగరాజన్ తెలిపారు. ఈ వ్యాధుల్లో సగానికిపైగా ప్రాథమిక దశలోనే గుర్తించి జెనిటిక్ కరెక్షన్ చేయడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చని చెప్పారు. అరుదుగా వచ్చే జన్యుపరమైన వ్యాధులపై అవగాహన కల్పించడంలో సీడీఎఫ్‌డీ కృషి చేస్తుందని డయాగ్నోస్టిక్స్ డివిజన్ హెడ్ అశ్విన్ బీ దలాల్ వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో 5,600 కుటుంబాలకు చెందిన పిల్లలకు సంక్రమించిన వ్యాధులను విశ్లేషించేందుకు డాటా సెంటర్ ప్రధాన పాత్రను పోషిస్తుందని తెలిపారు.