(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వెలుగు చూసిన రూ. 187 కోట్ల విలువైన ‘వాల్మీకి’ కుంభకోణంలో హైదరాబాద్‌లోని ఫస్ట్ ఫైనాన్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ ఇటకారి కీలక పాత్ర పోషించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం తాజా నివేదికలో వెల్లడించింది. స్కామ్‌కు సంబంధించిన రూ.90 కోట్ల ను ఏపీ, తెలంగాణకు మళ్లించడంలో ఈయన సాయపడ్డారని తెలిపింది. నగదును డిపాజిట్ చేయడానికి 18 ఖాతాలను తెరిచారని, ఒక్కో ఖాతా తెరవడానికి రూ.3.8 లక్షల చొప్పున మొత్తం రూ.68 లక్షలను ఈయన వసూలు చేసినట్టు సిట్ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు మరో రూ.1.5 కోట్లను బహుమతులుగా తీసుకొన్నట్టు పేర్కొన్నారు. ఇందులో 9 నకిలీ ఖాతాల నుంచి రూ.44.6 కోట్లు హైదరాబాద్‌లోని ఆర్బీఎల్ బ్రాంచీకి బదిలీ అయ్యాయి. సత్యనారాయణను ఏ-3గా సిట్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
హైదరాబాద్‌కు నగదు బదిలీ ఇలా..
వాల్మీకి కార్పొరేషన్ నుంచి దారి మళ్లిన మొత్తం రూ.187 కోట్లలో తెలుగు రాష్ర్టాలకు రూ.90 కోట్లు చేరినట్టు సిట్ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఇందులో రూ.44.6 కోట్లు హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది కంపెనీల బ్యాంకు ఖాతాల్లో జమైనట్టు వివరించింది. సిట్ నివేదిక ప్రకారం.. వాల్మీకి కార్పొరేషన్ ఎండీ, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న జేజీ పద్మనాభ్, సస్పెండైన అకౌంట్స్ అధికారి పరశురామ్ బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్డు బ్రాంచీలో మార్చి 30, 2024న రూ.50 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ టర్మ్ డిపాజిట్‌పై అదే రోజు రూ.45 కోట్ల మేర రుణానికి దరఖాస్తు చేశారు. ఇందులో నుంచి అదే రోజు హైదరాబాద్‌లోని ఫస్ట్ ఫైనాన్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఖాతాల్లోకి అటునుంచి ఆర్బీఎల్ బ్రాంచీకి చెందిన 9 బ్యాంకు ఖాతాలకు రూ.44.6 కోట్లను బదిలీ చేశారు. ఈ మేరకు సిట్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌కు చేరిన రూ.44.6 కోట్ల నగదుతో లోక్‌సభ ఎన్నికల ముందు పెద్ద యెత్తున మద్యం, ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.