హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సఖి కేంద్రాలు ఎంతోమంది మహిళలకు భరోసానిస్తున్నాయి. పలు సమస్యలతో బాధితులుగా మారిన బాలికలు, యువతులు, వివాహితలు, అనాథలకు అండగా నిలుస్తున్నాయి. అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ఆశ్రయం కల్పిస్తున్నాయి. బాధిత మహిళలకు వరంగా మారిన ఈ కేంద్రాలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఈ కేంద్రాలకు పోలీసు శాఖ, న్యాయ విభాగాలు సహకరిస్తున్నాయి. కులమతాలు, ప్రాం తీయ బేధాలకు తావులేకుండా అభాగ్యులను ఈ సెంటర్లు చేరదీస్తున్నాయి. బాధితులకు అవసరమైన వసతి కల్పించడంతోపాటు ఖర్చు మొత్తం మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భరిస్తున్నారు.
2017లో ఏర్పాటు చేసిన సఖి కేంద్రాల్లో ఇప్పటివరకు దాదాపు 65,600 కేసులు నమోదైనట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇందులో 43,100 గృహహింస కేసులు, వరకట్నం వేధింపులు 3,049, సైబర్ నేరాలు/చీటింగ్ 3,185, లైంగిక వేధింపులు(పోక్సో) 2,278, బాల్య వివాహాలు 1,819, మిస్సింగ్/కిడ్నాప్‌లు 4,212, లైంగిక హింస 389, లైంగికదాడి 546, ఉమెన్ ట్రాఫికింగ్ 182, యాసిడ్ దాడి 5 కేసులు నమోదయ్యాయి. ఇతర రకరకాల అంశాలు కలిపి మొత్తం 6,800 వరకు కేసులు నమోదైనట్టు సంబంధిత అధికారులు తెలిపారు.