Aarogyasri | ఆరోగ్య శ్రీ పథకంలో అదనంగా 65 అధునాతన చికిత్స విధానాలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. వీటితో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వాటిలో 1,375 విధానాలకు ప్యాకేజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్య శ్రీ పథకం కింద కొత్త చికిత్స విధానాలు, ప్రస్తుత పథకాల ఆర్థిక సవరణకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూసకు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే ఆరోగ్యశ్రీలో 1672 చికిత్స విధానాలు అందుబాటులో ఉండగా.. వాటిలో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు.