హనుమకొండ చౌరస్తా, మే 23 : వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)కి చెందిన ఈసీఈ విద్యార్థి సోమిల్ మల్దానీకి రూ.64.3లక్షల గరిష్ఠ ప్యాకేజీ లభించినట్టు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. 79.7శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 290కి పైగా సంస్థలు క్యాంపస్‌ను సందర్శించాయని, 1,508 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌కు నమోదు చేసుకోగా, 1,201 మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు.
యూజీలో 679 మంది, పీజీలో 522 మంది కాగా, మొత్తం 79.7శాతం ప్లేస్మెంట్ రేటుగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ సగటు ప్యాకేజీ రూ.14.35లక్షలు ఉండగా, యూజీ విద్యార్థులకు రూ.16 లక్షలు, పీజీ విద్యార్థులకు రూ.12.20 లక్షలుగా ఉందని వెల్లడించారు. తొలిసారి పీహెచ్డీ విద్యార్థుల ప్లేస్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక ప్రయత్నాలు చేయగా, ఆరుగురు పీహెచ్డీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్టు, వీరి సగటు ప్యాకేజీ రూ.9 లక్షలుగా ఉందని తెలిపారు.