హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కార్మిక శక్తి పుష్కలంగా ఉన్నది. లేబర్ మార్కెట్ సూచికల్లో రాష్ట్ర కార్మిక శక్తి జోరును ప్రదర్శిస్తున్నది. నిరుద్యోగిత, పురుషుల కార్మిక శక్తి అంశాల్లో మినహా మిగతా అన్ని అంశాల్లో జాతీయ సగటు కంటే ఉన్నతస్థాయిలో సాగుతున్నది. 2024-25 సామాజిక ఆర్థిక గణాంకాల ప్రకారం.. తెలంగాణ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) జాతీయ సగటు (61.6%)ను అధిగమించి 66.5 శాతానికి చేరింది.
ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతో దోహదపడుతున్నది. పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం.. మహిళా శక్తిలో జాతీయ సగటు 39.8 శాతంగా, తెలంగాణలో 50.4 శాతంగా ఉన్నది. తెలగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఎల్ఎఫ్పీఆర్ 64.4% కాగా.. జాతీయ సగటు 44.3% మాత్రమే. రాష్ట్రంలో పురుషుల ఎల్ఎఫ్పీఆర్ 81.8 శాతంగా నమోదవగా..జాతీయ సగటు 83.2 శాతంతో కాస్త మెరుగ్గా ఉన్నది.
ఉపాధి పొందిన వ్యక్తుల శాతాన్ని డబ్ల్యూపీఆర్ సూచిస్తుంది. ఇది తెలంగాణలో 63.4 శాతంగా, జాతీయ సగటు 59.5 శాతంగా ఉన్నది. నిరుద్యోగ రేటు విషయంలో తెలంగాణ (4.6%) కంటే జాతీయ సగటు (3.4%) మెరుగ్గా ఉన్నది. రాష్ట్రంలోని వయోజనుల్లో 47.3% మంది వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా.. 33% మందికి సేవారంగం, 19.7% మందికి పారిశ్రామిక రంగం ఉపాధిని కల్పిస్తున్నాయి.
జాబ్ మారెట్నే లేబర్ మారెట్ అని అంటారు. ఒక దేశం లేదా ప్రాంతంలో కార్మికులు/ఉద్యోగులకున్న డిమాండ్, వారి సరఫరాను జాబ్మారెట్గా చెప్తారు. ప్రతి దేశానికి లేబర్ మార్కెట్ ఎంతో కీలకం. జాబ్ మార్కెట్లో కంపెనీలు, సంస్థలు(ఎంప్లాయర్స్) డిమాండ్‌ను సృష్టిస్తే.. కార్మికులు/ఉద్యోగులు (ఎంప్లాయీస్) ఉత్పత్తిని అందిస్తారు.