హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మూడు, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇటీవల ఎన్ఎంసీ నోటీసులతో స్పందించిన సర్కారు ఈ మేరకు పోస్టుల భర్తీకి సిద్ధమైనట్టు తెలిసింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, మౌలిక వసతులు లేవని ఇటీవల ఎన్ఎంసీ 26 కళాశాలలకు నోటీసులు ఇవ్వడంతో నిద్రలేచిన సర్కారు.. వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయి వసతులు కల్పించాలని, ఇందుకు ఓ కమిటీ ఏర్పాటుచేసి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
దీంతోపాటు బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్ఎంసీ విచారణలో వీలైనంత త్వరగా ఫ్యాకల్టీని నియమించుకోవాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈలను జాతీయ వైద్య మండలి ఆదేశించింది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.