Group- 1 Prelims | హైదరాబాద్/రంగారెడ్డి/ సిద్దిపేట అర్బన్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కఠినంగా వచ్చింది. అభ్యర్థుల లోతైన అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు వచ్చాయి. నిరుడు అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 పేపర్‌కు భిన్నంగా ఆదివారం నిర్వహించిన పేపర్ ఉండటం విశేషం. గతంలో అడిగిన వాటిని మినహాయించి, అప్పట్లో అడగని అంశాల నుంచే ఈసారి ప్రశ్నలిచ్చారు. తెలంగాణ సంస్కృతి, భౌగోళికంపై పట్టు ఉంటేనే సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది.
503 గ్రూప్-1 ఉద్యోగాలకు 3,80,081 మంది దరఖాస్తు చేయగా, 2,32,457 మంది.. అంటే 61.37 శాతం మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు ఈసారి కమిషన్ మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కలెక్టర్లు జిల్లా అథారిటీ ఆఫీసర్లుగా, అడిషనల్ కలెక్టర్లు చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరీక్షల తీరును పరిశీలించారు. 994 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 994 మంది లైజన్ ఆఫీసర్లు, 310 రూట్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు.
గత తప్పిదాలను పరిగణలోకి తీసుకొన్న కమిషన్ ఈ సారి కఠిన నిబంధనలు విధించింది. పురుష, మహిళా పోలీసులు గేట్ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఆ తర్వాత పరీక్ష కేంద్రాలను మూసివేశారు. హాల్‌టికెట్లు, ఐడీ ప్రూఫ్‌లు అన్నీ ఒకటికి రెండుసార్లు పరిశీలించారు. పరీక్షల తీరును హైదరాబాద్‌లోని నాంపల్లిలోగల పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కమిషన్ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షించారు.
‘అరగంట ముందే..’ ప్రచారం అవాస్తవం: కలెక్టర్ హరీశ్
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని చైతన్య కాలేజీలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రంలో అరగంట ముందుగానే అభ్యర్థుల నుంచి ఓఎంఆర్ షీట్లను తీసుకున్నారనే ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని కలెక్టర్ డాక్టర్ ఎస్ హరీశ్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తప్పని ఖండించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయాలను పాటిస్తూ ప్రశ్న పత్రాలు ఇచ్చామని, పరీక్ష సమయం ముగిసిన తర్వాతే ఓఎంఆర్ షీట్లను తీసుకొన్నట్టు చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ప్రచార సాధనాల్లో అసత్య ప్రచారాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
పరీక్ష ప్రారంభానికి ముందే అభ్యర్థి బయటకు
సిద్దిపేటలో ఓ అభ్యర్థి పరీక్ష ప్రారంభానికి ముందే బయటకొచ్చాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆ అభ్యర్థి వ్యవహరించడంతో అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చెప్పారు. సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామానికి చెందిన బీ ప్రశాంత్ సిద్దిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యాడు. ఓఎంఆర్ షీట్లో తన హాల్ టికెట్ నంబర్‌ను తప్పుగా రాశాడు. దీంతో పరీక్ష రాసినా ఉపయోగం లేదనే ఉద్దేశంతో ప్రశ్నపత్రం ఇవ్వకముందే హాల్ వదిలి బయటకు వచ్చాడు. దీన్ని గమనించిన పోలీస్ సిబ్బంది అభ్యర్థిని అరెస్ట్ చేశారు.
తెలంగాణపైనే ఫోకస్
40 శాతం కంటే ఎక్కువ పట్టణ జనాభాగల జిల్లా ఏది? తెలంగాణలో భౌగోళిక విస్తీర్ణం ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లాలేవి? హిందు, ముస్లింలు ధరించే కులా, ఖబా అంటే అర్థమేంటి? ఇవి గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అడిగిన కొన్ని ప్రశ్నలు. ఇటీవలీ కాలంలో టీఎస్పీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్లోను తెలంగాణ అంశాలపై ప్రశ్నలిస్తున్నారు. స్థానిక సంస్కృతి, పరిస్థితులపై అవగాహన ఉన్నవారే ఉద్యోగాలు సాధించాలన్న ఆకాంక్ష, ఈ ప్రాంతపు బిడ్డలే ఉద్యోగాలు సాధించాలన్న ఆలోచనతో పేపర్లను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్‌లోనూ అభ్యర్థులకు గల సునిశిత పరిశీలన, లోతైన అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలిచ్చారు. 16కు పైగా ఇలాంటి ప్రశ్నలే రావడం విశేషం. కాకతీయుల చరిత్రపైనా మూడు ప్రశ్నలిచ్చారు. అర్ధ గణాంకశాఖ రూపొందించిన సోషియో ఎకనామిక్ సర్వే నుంచి తెలంగాణ అంశాలపై ప్రశ్నలొచ్చాయి.
ప్రశ్నలు పునరావృతంకాకుండా..
సాధారణంగా పరీక్షలంటే పాత పేపర్లు తిరగేస్తే సరిపోతుంది అని అంతా అనుకుంటారు. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న పరీక్షల్లో పాత ప్రశ్నలు పునరావృతం కాకుండా టీఎస్పీఎస్సీ పకడ్బందీ జాగ్రత్తలు తీసుకొంటున్నది. దీంతో గతంలో అడిగిన ప్రశ్నలు పునరావృతంకావడం లేదు. ఉదాహరణకు గత పేపర్లో రీజనింగ్ విభాగంలో దిక్కులు, కుళాయిలపై ప్రశ్న ఇవ్వగా, ఈ సారి ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు రాలేదు. ఈ సారి జనరల్ ఇంగ్లిష్‌పై ఒక్క ప్రశ్నకూడా ఇవ్వలేదు.
గ్రూప్-1లో అడిగిన కొన్ని ప్రశ్నలు..
కఠినంగానే ప్రశ్నలు
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. చాలా వాటికి వెతికితే తప్ప ఆన్సర్లు దొరికేలా లేవు. ప్రశ్నలు నేరుగా అడగకుండా, ఎలిమినేషన్ పద్ధతిలో ఆప్షన్లను ఎంపిక చేసుకొనే అవకాశం లేకుండా ఉండటంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. కాన్పెప్ట్ ఆధారిత ప్రశ్నలొచ్చాయి.
– బాలలత, సీఎస్బీ డైరెక్టర్
జనరల్ కటాఫ్ 70 ఉండే చాన్స్
గత ప్రిలిమ్స్‌లో ప్రశ్నల నిడివి పెద్దగా ఉండగా, ఈ సారి ప్రశ్నల నిడివి చిన్నవిగానే ఉంది. కానీ ప్రశ్నలు కఠినంగా ఇచ్చారు. గత ప్రిలిమ్స్‌లో సివిల్ సర్వీసెస్, పోలీస్, కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు పోటీపడేవారు గణనీయంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి ఉంటుందని నేను భావించడంలేదు. గ్రూప్ -2, గ్రూప్ -3కి సన్నద్ధమయ్యేవారు, ఆఖరుకు సివిల్స్ అభ్యర్థులు సైతం ప్రశ్నలకు సమాధానాలు చేయలేకపోయారు. జనరల్ కటాఫ్ 70 వరకు ఉండే అవకాశాలున్నాయి.
– దీపికారెడ్డి, శిఖర అకాడమీ, వ్యవస్థాపకురాలు