హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అనుమతు లు ఇస్తే.. తెలంగాణలో ప్రవేశించేందుకు కొత్తగా 603 మద్యం బ్రాండ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 1956 మద్యం బ్రాండ్లు చలామణిలో ఉండగా.. ప్రభుత్వ అనుమతి కోసం 603 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు ఎదురుచూస్తున్నాయి. వీటి అనుమతి కోసం సుమారు 97 కంపెనీలు ఇటు రాష్ట్ర ఎక్సైజ్ ఆఫీసు చుట్టూ అటు సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల ఎక్సైజ్‌శాఖ అధికారులకు భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) పట్టుబడింది. ఆ మద్యం సీసాల్లో లోకల్ బ్రాండ్లు లేకపోవడం అధికారులకు విస్మయం కలిగించింది.
ఈ ఎన్డీపీఎల్లో అత్యధికశాతం మన దగ్గర అందుబాటులో లేని జాతీయ, అంతర్జాతీయ బ్రాం డ్లే ఉంటున్నాయని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న బ్రాండ్లకు అనుమతి లభిస్తే.. ఈ ఎన్డీపీఎల్ బాధ తగ్గుతుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొత్తవాటికి అనుమతిస్తే.. ఒక్కో బ్రాండ్‌కు రూ.15 వేల చొప్పున అనుమతి ఫీజును వసూలు చేయనున్నా రు. తద్వారా రూ.90,45,000లు ప్రభుత్వానికి రాబడి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 13 బీర్ కంపెనీలు, 51 జాతీయ లిక్కర్ కంపెనీలు, 27 విదేశీ లిక్కర్ కంపెనీల నుంచి 86 రకాల బీర్ బ్రాండ్లు, 770 రకాల ఇండియన్ లిక్కర్ బ్రాండ్లు, 1091 విదేశీ లిక్కర్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని వివాదాస్పద మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అప్పటికే సదరు కంపెనీల నేపథ్యం వివాదాస్పదంగా ఉండటం, కొన్నిచోట్ల అవి కల్తీ మద్యం విక్రయించాయని తేలడంతో ‘నమస్తే తెలంగాణ’ వరసగా కథనాలు ప్రచురించింది. దీంతో ప్రభుత్వం వాటితో ఒప్పందాలు రద్దు చేసుకున్నది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఎక్సైజ్‌శాఖ వివాదాస్పద కంపెనీలను పక్కనపెట్టింది. ప్రభుత్వ పెద్దలు సమాలోచన చేసి.. తెలంగాణలో కొత్తగా బీర్లు, మద్యం సరఫరా చేయాలనుకునే కంపెనీల కోసం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వాటిల్లో కొన్ని కంపెనీలు ఇప్పటికే 603 రకాల బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు అనుమతుల కోసం తిరుగుతున్నాయి. అయితే, సదరు కంపెనీలకు ఇంకా అనుమతి లభించకపోవడానికి ముఖ్యకారణం ప్రభుత్వ పెద్దల ‘కమీషన్’ వ్యవహారమేనని విశ్వసనీయంగా తెలిసింది.