హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్‌ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భం గా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారు లు, రచయితలు ముఖ్య భూమిక పోషించారని, యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేశారని చెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలచారి, యావ కళావాహినికి చెందిన సారిపల్లి కొండల్రావు, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి సుంచు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.