మనం మార్కెట్‌కు పోతే ఏం చేస్తం?కావాల్సిన సామాన్లు ఏ దుకాణంలో ఉన్నయో తెలుసుకుంటం. ఏమేం కావాల్నో ఎంచుకుంటం. వాటి ధర ఎంతో కనుక్కుంటం. తగ్గించాలని బేరమాడుతం. నచ్చిన వాటిని కొనుక్కుంటం. బిల్లు ఎంతైందో లెక్కవేసి, దుకాణదారుకు డబ్బులు చెల్లిస్తం.
ఆ తర్వాత ఏం చేస్తం?కొన్న సామాన్లను ఇంటికి ఎట్ల తీసుకుపోవాల్నా అని ఆలోచిస్తం. ఆటోనో, ట్రాలీనో కిరాయికి మాట్లాడుతం. ఇంటికి సామాన్లు చేరవేసినందుకు పైసలు ఇస్తం. అంతే కదా!
ఇది ఎవరికి తెల్వని సంగతి? దీనికింత రాయాలా? అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు. కానీ రాజకీయ కక్షతో కళ్లు మూసుకుపోయిన మన రాష్ర్త ప్రభుత్వానికి మాత్రం ఇంత చిన్న విషయం కూడా తెల్వడం లేదు! అదేమిటో తెలుసుకోవాలంటే మీరు ఈ కథనం చదవాల్సిందే
Telangana | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ‘పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టండి’ అన్నాడట వెనకటికి ఒకడు. మన రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉంది. విద్యుత్తు విచారణ కమిషన్ వ్యవహారంపై ‘ఇదేం కమిషన్, మీదేం విచారణ?’ అని నిలదీస్తూ, నాటి తెలంగాణలో విద్యుత్తు సంక్షోభం, తాము తీసుకున్న చర్యలు, తత్ఫలితంగా కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ, గణాంకాలు, డాక్యుమెంట్ల సాక్ష్యమిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖతో దిమ్మదిరిగి మైండ్ బ్లాంకైన కాంగ్రెస్ పార్టీ-ప్రభుత్వం ఆ తప్పు నుంచి బయటపడడానికి మరిన్ని తప్పులు చేసి అభాసుపాలవుతున్నది. జరగని నష్టం జరిగినట్టు చూపించడానికి అష్టకష్టాలు పడుతూ అభాసుపాలవుతున్నది. కేసీఆర్ సూటిగా వేసిన ప్రశ్నలకు, స్ట్రెయిటుగా జవాబు చెప్పలేని ప్రభుత్వం, ‘ఆయన రాసిన లేఖ గురించి మేమేం చెప్పేది లేదు. కమిషనే చూసుకుంటది. న్యాయస్థానం చూసుకుంటది’ అని ఒకవైపు సన్నాయి నొక్కులు నొక్కుతూనే, మరోవైపు లీకుల లాకులు తెరుస్తున్నది.
ఇందులో భాగంగా సోమవారం (యథాప్రకారం) రాత్రి ప్రభుత్వం నుంచి ఒక లీకు విడుదలైంది. బాకా పత్రికలు, ఛానెళ్ల కోసమని వేరే చెప్పనక్కర్లేదు! అందులో ఏం ఉందంటే… ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్తుతో తెలంగాణ విద్యుత్తు సంస్థలు అంచనాలకు మించి నష్టపోయాయాట! ఒప్పందం ప్రకారం ఒక్క యూనిట్ ధర రూ.3.90 మాత్రమే అని చెప్తున్నప్పటికీ ఈ విద్యుత్తు కొనుగోలుతో రాష్ట్ర విద్యుత్తు సంస్థల నడ్డి విరిగినంత పనైందట. కరెంటు కొనేందుకు చేసిన చెల్లింపులతో పాటు, ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు రూ.1362 కోట్లు కూడా కలిపితే యూనిట్‌కు రూ.5.64 దాకా ఖర్చయ్యిందట. అందువల్ల చెప్పుకొన్న రేటు కంటే, వడ్డించిన ఛార్జీలతో దాదాపు రూ.3110 కోట్లు అదనపు భారం పడినట్లయిందట” ఇదీ ఆ లీకు వరుస! ఇది చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కరెంటు గురించి ఓనమాలైనా తెలుసా? అన్న సందేహం కలుగుతున్నదని విద్యుత్తురంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి చేసేవారి నుంచి కరెంటు కొంటం. అందుకు ఒప్పందం చేసుకుంటం. కానీ అట్లా కొన్న కరెంటు తెలంగాణకు రావాలి కదా, రావాలంటే అందుకు విడిగా ట్రాన్స్మిషన్ చార్జీలు చెల్లించడం తప్పనిసరి.
పీజీసీఐఎల్కే వీలింగ్ చార్జీలు
షాపులో మనం ఫ్రిజ్ కొంటం. ఫ్రిజ్ రేటు షాపులో చెల్లిస్తం. దాన్ని ఇంటికి చేర్చాలంటే ఆటోకో, ట్రాలీకో కిరాయి చెల్లిస్తం కదా! అలాగన్నమాట. ఘనత వహించిన రేవంత్ ప్రభుత్వానికి ఈ సంగతి కూడా తెలిసినట్టు లేదు. ఈ దేశంలో విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, నిర్వహణ చూసేది ఒక్కే ఒక్క సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్). ఏ రాష్ర్టం ఎక్కడ కరెంటు కొనుక్కున్నా, దాన్ని తమ ప్రాంతానికి తెచ్చుకోవాలంటే మాత్రం పీజీసీఐఎల్పై ఆధారపడాల్సిందే. ఆ సేవలు అందించినందుకు అది వీలింగ్ చార్జీని వసూలు చేస్తుంది. ఇది సాధారణ విద్యుత్తు రంగ నిపుణుడికి కూడా తెలిసిన కామన్ విషయం. మరి పదేండ్ల కిందట తీవ్ర విద్యుత్తు సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను, దాన్నుంచి బయటపడేయడానికి, అత్యవసర సమయంలో చవక ధరకు ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్తు కొన్న కేసీఆర్ ప్రభుత్వం, దాన్ని తెలంగాణకు తెచ్చుకోవాలా? వద్దా? తెచ్చుకోవాలంటే పీజీసీఐఎల్‌కు ఎవరైనా వీలింగ్ చార్జీలు కట్టాల్సిందే కదా!
మరి కాంగ్రెస్ చేస్తున్నదేంటి?
నాడు ఛత్తీస్‌గఢ్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం రూ.3.90కే యూనిట్ కరెంటు కొన్నది. వార్ధా- డిచ్పల్లి లైను సత్వరమే పూర్తయ్యేలా పీజీసీఐఎల్‌కు సహకరించి, డెడికేటెడ్ కారిడార్ బుక్ చేసుకుని, ఆ కరెంటును తెలంగాణకు తెచ్చి, రాష్ట్ర ప్రజలను కరెంటు కష్టాల నుంచి బయటపడేసింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు అంది, కోతలు, కొరతల నుంచి రాష్ట్రం బయటపడిన సంగతిని ప్రజలింకా మరిచిపోలేదు. లీకులో ఆరోపించినట్టు ఒకవేళ ట్రాన్స్మిషన్ చార్జీల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా అనుకుంటే, పీసీజీఐల్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. డెడికేటెడ్ కారిడార్ విషయంలోగానీ, ఓపెన్ మార్కెట్ సరఫరా సమయంలో వీలింగ్ చార్జీల విషయంలో అది ఏం చెప్తే అదే ఫైనల్! అంతెందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓపెన్ మార్కెట్లో, పీక్ అవర్స్‌లో, ఒక యూనిట్‌కు రూ.8 నుంచి 12 దాకా, నాన్ పీక్ అవర్స్‌లో రూ.5-6 దాకా పెట్టి కరెంటు కొంటున్నది. (కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి కొన్నది యూనిట్‌కు రూ.3.90కే).
ఈ ఎండకాలంలోనే ఇట్లా దాదాపు వేల మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది. తెలంగాణ ప్రభుత్వం వివిధ విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొంటున్న కరెంటును తెలంగాణకు తెచ్చుకోవడానికి ఏటా దాదాపు 2300 కోట్ల రూపాయలను ట్రాన్స్మిషన్ (వీలింగ్) చార్జీల రూపంలో పీజీఐసీఎల్కు చెల్లిస్తున్నదని విద్యుత్తు నిపుణులు చెబుతున్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం ట్రాన్స్మిషన్ చార్జీలు చెల్లించడం తప్పైతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తున్నట్టు? అయినా విద్యుత్తు కొనుగోలు రేటు వేరు, ట్రాన్స్ మిషన్ చార్జీ వేరు, కరెంటు కావాలంటే రెండూ ఉండాల్సిందే, ట్రాన్స్మిషన్ చార్జీ చెల్లించకుండా కరెంటు తెచ్చుకోవడం అసంభవం అనే కనీస అవగాహన లేకుండా లీకులిస్తే ఎట్లా అని విద్యుత్తు రంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లాజిక్ ప్రకారం వాళ్లు చెల్లిస్తున్న ట్రాన్స్మిషన్ చార్జీలను, వాళ్లు కొంటున్న విద్యుత్తు రేటుకు కలిపి యూనిట్ ధర చూపిస్తే గుండె పగిలే లెక్క తేలుతుందని వారు హెచ్చరిస్తున్నారు. వీలింగ్ చార్జీలు కూడా డిమాండ్‌ను బట్టి మారుతుంటాయని, లైన్ మీద ఉండే ఒత్తిడిని, అందుబాటును బేస్ చేసుకుని పీజీసీఐల్ ఎప్పటికప్పుడు వీలింగ్ చార్జీలను ఖరారు చేస్తుందని వారు గుర్తుచేస్తున్నారు.
కేసీఆర్ ముందుచూపుతోనే కష్టాలకు చెక్
“ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో పీజీసీఐఎల్‌కు లైన్ నిర్మాణంలో సహకరించి ముందస్తుగా డెడికేటెడ్ కారిడార్ బుక్ చేసుకోవడం వల్ల వీలింగ్ చార్జీలు పరిమితంగా ఉన్నాయి. ముందు జాగ్రత్తతో కారిడార్ బుక్ చేయకుండా ఓపెన్ మార్కెట్ ట్రాన్స్మిషన్కే గనక వెళ్లుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. నాడు కేసీఆర్ ప్రభుత్వం మరొక అద్భుతమైన చర్య తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదింపులు జరిపి స్టేట్ (రాష్ట్రం లోపల) ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు తీసుకుంది. అంతర్రాష్ట్ర (ఇంటర్ స్టేట్) ట్రాన్స్మిషన్కు మాత్రమే పీజీఐఎల్కు చెల్లింపులు జరిపింది. దీనివల్ల కూడా తెలంగాణపై కొంత భారం తగ్గింది. ఇప్పటి ప్రభుత్వానికి ఇవేవీ అర్థమవుతున్నట్టు లేవు” అని విద్యుత్తు రంగంలో తలపండిన నిపుణుడు ఒకరు వివరించారు. ‘ఛత్తీస్‌గఢ్ నుంచి అరకొరగానే సరఫరా అయింది. ఎన్నడూ వెయ్యి మెగావాట్లు సాఫీగా రాలేదు. అక్కడి నుంచి ఆశించిన సరఫరా తగ్గిపోవటంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చింది’ అని లీకులో మరో వాక్యాన్ని వండివార్చారు. నిజం ఏమిటంటే 2014లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో రాష్ర్తంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది.
మూర్ఖపు వాదన
“కరెంటులో ఉన్న విచిత్రం ఏమిటంటే దీన్ని నిల్వ చేసుకోలేం. సరఫరా కూడా కన్సిస్టెంట్గా ఉండదు. సీజన్లు, అవసరాలు, వాతావరణ పరిస్థితులను బట్టి ఒకసారి పెరుగుతుంది. ఒకసారి తగ్గుతుంది. ఎంత ఫర్మ్ పవర్ ఉన్న రాష్ట్రమైనా, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా ఎంతో కొంత వరకు ఓపెన్ మార్కెట్‌పై ఆధారపడక తప్పదు. నాడు తీవ్ర విద్యుత్తు సంక్షోభంలో ఉన్న తెలంగాణ ఒక్కసారి 24 గంటలు పొందడం వివిధ రంగాల్లో వాడకం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. అందువల్ల ఓపెన్ మార్కెట్లో కొనడం అనివార్యం. అంతెందుకు? కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ స్థాపిత విద్యుత్తును మూడు రెట్లు పెంచిన తర్వాత, ఇప్పుడు కూడా మనం ఓపెన్ మార్కెట్లో కొనక తప్పడం లేదు. ఇదీ వాస్తవం కాగా ఓపెన్ మార్కెట్లో కొనడం తప్పైనట్టు, దానివల్ల భారం పడ్డట్టు వాదించడం మూర్ఖత్వం. భారం గురించి ఆలోచించేవారు 24 గంటల కరెంటు వల్ల మారిన జీవన నాణ్యత గురించి, పెరిగిన సాగుభూమి గురించి, పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి గురించి, అధికమైన వ్యవసాయ దిగుబడుల గురించి, రికార్డు సృష్టించిన ఐటీ ఎగుమతుల గురించి, ఉపాధి అవకాశాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు” అని మరో నిపుణుడు ప్రశ్నించారు.
అభినందించాల్సింది పోయి.. బురద జల్లుడా?
తెలంగాణ విద్యుత్తు సంక్షోభంలో కూరుకుపోవడానికి దాదాపు 60 ఏండ్లు ఉమ్మడి ఏపీని పరిపాలించిన కాంగ్రెస్సే కారణమని, చివరికి కేసీఆర్ అన్ని ఏర్పాట్లూ చేసి ఇచ్చి చూపించిన 24 గంటల కరెంటు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోతున్నదని, దాన్నుంచి తప్పించుకునేందుకే ఈ బురదజల్లే ప్రయత్నమని ఆయన విశ్లేషించారు. “ప్రాణంమీదికి వచ్చినప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తామా? లేక ప్రాణం నిలబెట్టుకోవడం గురించా? ఆనాడు కరెంటు విషయంలో తెలంగాణ పరిస్థితి ఇలాంటిదే. అయినా కేసీఆర్ ప్రభుత్వం అటు ఛత్తీస్‌గఢ్‌తోనూ, ఇటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోనూ మాత్రమే ఒప్పందాలు చేసుకుని ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, అధిక రేట్ల భారం పడకుండా జాగ్రత్త పడింది. అందుకు అందరూ దాన్ని అభినందించాలి” అని ప్రభుత్వ రంగ సంస్థల నిపుణుడొకరు పేర్కొన్నారు. “ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) తో 1000 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు కారిడార్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారిడార్ కూడా విద్యుత్తు సంస్థల కొంప ముంచింది. బుకింగ్ ఒప్పందం ప్రకారం విద్యుత్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్ కు సరఫరా ఛార్జీలు కట్టాల్సిందే. ఈ లెక్కన వాడకున్నా కట్టిన అదనపు ఛార్జీలు రూ.638 కోట్లు” అనే వాదననూ ఆయన తోసిపుచ్చారు. ఛత్తీస్‌గఢ్ రెండు వేల మెగావాట్ల కరెంటు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. వెయ్యి మెగావాట్లుకు పీపీఏ చేసుకుంది. ఆనాడు తెలంగాణ ఉన్న సంక్షోభ పరిస్థితిలో, ఎక్కడా కరెంటు దొరకని కరువులో పీపీఏ జరిగిన వెయ్యి మెగావాట్ల కన్నా తక్కువకు ఎలా కారిడార్ బుక్ చేస్తామని ఆయన ప్రశ్నించారు. మరో వెయ్యి మెగావాట్ల కారిడార్ బుకింగ్- రద్దుతో ఖజానాపై ఎలాంటి భారం పడలేదని ఆయన వివరించారు.
ఈఆర్సీ ఆమోదంతోనే విద్యుత్తు కొనుగోలు
న్యాయప్రాధికార సంస్థ (క్వాసీ జ్యుడీషియల్) అయిన ఈఆర్సీ తీర్పులపై విచారణ జరిపే అధికారం కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కమిషన్ చెల్లదని కేసీఆర్ తన లేఖలో కుండబద్ధలు కొట్టారు. దీంతో కమిషన్ చైర్మన్, ప్రభుత్వ పెద్దల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. దీని నుంచి తప్పించుకోవడానికి తమవాదన సరైనదని నిరూపించుకోవడానికి ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పీపీఏను ఈఆర్సీ ఆమోదించలేదని లీకులిస్తున్నది. ‘విద్యుత్తు చట్టం ప్రకారం పీపీఏకు, విద్యుత్తు అమ్మే రాష్ట్ర ఈఆర్సీ ఆమోదం తప్పనిసరి. ఈఆర్సీ ఆమోదం లేకుండా విద్యుత్తు కొనుగోలు జరగడం అనేది అసాధ్యం. పీపీఏను ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదం కోసం పంపినట్టు కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఈఆర్సీ ఆమోదం లేదంటున్నది. అడ్డదారి చెల్లింపులు అంటున్నది. అయినా ఒక ప్రభుత్వం, లేదా ప్రభుత్వ సంస్థ ఎక్కడైనా మరో ప్రభుత్వానికి, లేదా ప్రభుత్వ సంస్థకు వేల కోట్లను అడ్డదారిలో చెల్లించగలదా? అది సాధ్యమవుతుందా? అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి భాషలో లీకులిస్తే ఏమనుకోవాలి? ఈసర్కారు తీరు చూస్తుంటే ఖర్చు దండుగ కమిషన్ తక్షణ కర్తవ్యం గోచి దక్కితే చాలు’ అన్నట్టు గాఉందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేఖతో జవాబు చెప్పలేని పరిస్థితిలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగోలా బురదజల్లి తప్పించుకోవాలనే ప్రయత్నమే ఈ లీకులు అన్నట్టుగా ఉందని విమర్శించారు. ‘సర్కారు వాదన నిజమైతే ఈ లీకులెందుకు? విచారణ కమిషన్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేయవచ్చు కదా?’ అని విద్యుత్తు రంగ నిపుణుడు ఒకరు ప్రశ్నించారు. ఈ ఉద్దేశపూర్వక లీకులతోనే ప్రభుత్వ వాదనలో పసలేదని అర్థమవుతున్నదని విశ్లేషించారు.
ఇదీ.. సర్కారీ లీకు..