Telangana | వికారాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ భూభాగం ఆక్రమణకు గురైంది. మైల్వార్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఇస్మాయిల్‌పూర్ తదితర గ్రామాల పరిధిలో 600 ఎకరాల్లో అటవీ భూములు కబ్జాకు గురయ్యాయి. ఎలాంటి ఆధారం లేకపోయినా తమ భూములేనంటూ గత కొన్నేండ్లుగా ఇక్కడి భూములను సాగు చేసేందుకు కన్నడ రైతులు ప్రయత్నాలు చేయడం, వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం జరుగుతూ వస్తున్నది. ఆ రాష్ట్ర రైతులకు స్థానిక ప్రజాప్రతినిధుల అండ ఉంటంతో ఆక్రమణలు ఆగటం లేదు. ఎలాంటి పట్టాలు లేకపోయినా తమ భూములేనంటూ వారు తెలంగాణ అధికారులతో గొడవకు దిగుతున్నారు.
మ్యాపుల్లో స్పష్టంగా తెలంగాణ భూభాగమేనని కర్ణాటక అధికారులకు తెలిసినా వారు ముందుకు వచ్చి వివాదాన్ని పరిష్కరించేలా ఆలోచించటం లేదు. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆక్రమణకు గురైన తెలంగాణ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.. రెండు రాష్ర్టాల సరిహద్దును గుర్తించి సమస్యను ఫుల్స్టాప్ పెట్టాలని అటవీ, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో అటవీశాఖ అధికారులు త్వరితగతిన సర్వే పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. వారంలో పని పూర్తిచేసే దిశగా సాగుతున్నారు. అయితే, రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం సరిహద్దు సమస్య తేల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఒకప్పుడు కర్ణాటకలోని గుల్బార్గా జిల్లాలో వికారాబాద్ జిల్లా అంతర్భాగంగా ఉండేది. అనంతరం తెలంగాణలో భాగమైంది. అయితే, తెలంగాణ-కర్ణాటక మధ్య పకడ్బందీగా సరిహద్దులను నిర్ణయించకపోవటంతో సరిహద్దు వివాదం ఏర్పడింది. ఏటా వికారాబాద్ జిల్లా యంత్రాంగం సరిహద్దు సమస్య తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కర్ణాటక అధికారులు మాత్రం స్పందించటం లేదు. 2017లో ఇరు రాష్ర్టాల మంత్రుల సమక్షంలో సమావేశం నిర్వహించి సరిహద్దుపై ఓ నిర్ణయానికి వచ్చినా.. మళ్లీ మొదటికొచ్చింది.
కర్ణాటక ప్రభుత్వం ఏటా కాగ్నా నదిలోని రాష్ట్ర సరిహద్దు భూభాగం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నది. ఏటా కొత్త సరిహద్దులను సృష్టిస్తూ హద్దు దాటుతూ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నది. బషీరాబాద్ మండలం క్యాద్గిర శివారులోని కాగ్నా నదిలో ఆ ప్రభుత్వం హద్దులు మీరి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నది. అయితే ఏడేండ్ల క్రితం బషీరాబాద్ మండలం క్యాద్గిర గ్రామం-సేడం తాలుకాలోని పోతంగల్ గ్రామాల మధ్యలోని కాగ్నా నదిలో భూభాగాన్ని సర్వే నిర్వహించి హద్దులను నిర్ణయించటంతో కర్ణాటక భూభాగం వరకు ఆ రాష్ట్ర రెవెన్యూ అధికారులు.. హద్దులుగా కర్రలు పాతారు.
ఆ తర్వాత ఆ ఆనవాళ్లు లేకుండా చేసిన సేడం రెవెన్యూ యంత్రాంగం.. మూడేండ్ల క్రితం జీపీఎస్ సర్వే అంటూ కాగ్నా నదిలో 70 శాతం భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు కొత్త హద్దులను సృష్టించింది. బషీరాబాద్ మండలంలోని క్యాద్గిర, గంగ్వార్ గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వికారాబాద్ జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం.. ఉమ్మడి సర్వే నిర్వహించి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఆ హద్దులను కూడా తుంగలో తొక్కిన కర్ణాటక.. తెలంగాణ భూభాగంలోని ఇసుకను తరలిస్తూ తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నది.