అందోల్/పుల్కల్, ఆగస్టు 18: రాష్ట్రంలోని గురుకుల విద్యార్థుల బాగోగులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో గురుకులాల్లో కలుషిత ఆహారం, పరిసరాల అపరిశుభ్రత వల్ల విద్యార్థులు విష జ్వరాల బారీనపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలలో 60మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దగ్గు, జలుబు, టైఫాయిడ్ జ్వరాలతో మంచం పట్టారు. పుల్కల్ డాక్టర్ సాయికిరణ్ ఆధ్వర్యంలో వైద్య బృందం విద్యార్థులకు చికిత్సలు అందిస్తున్నారు. అయినా విద్యార్థులకు మూడురోజుల నుంచి జ్వరం తగ్గకపోవడం తో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ ఆగమయ్య తెలిపారు. జ్వరం తీవ్రత తక్కువగా ఉన్న విద్యార్థులకు క్వారంటైన్లో ఉంచి, చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న పుల్కల్ తహసీల్దార్ కృష్ణ సోమవారం పాఠశాలను సందర్శించా రు. కాగా, గురుకుల విద్యార్థుల విష జ్వరాలపై మాజీ మంత్రి హరీశ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం చేస్తామంటూ ఉపన్యాసాలతో ఊదరగొట్టే సీఎం రేవంత్రెడ్డి.. సంగారెడ్డి జిల్లా సింగూరు గురుకుల పాఠశాల విద్యార్థుల అవస్థలు కనిపించ డం లేదా..? అని ప్రశ్నించారు. జ్వరం వచ్చిన పిల్లలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సోయికూడా లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.