YES Scheme | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఎస్టీల్లో మరింత వెనుకబడిన వర్గమైన ఎరుకల సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక బతుకు ‘ఎరుక’ చెప్పింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి స్వశక్తితో ఎదిగేందుకు ప్రారంభించిన ఎరుకల సాధికారత పథకాని (వైఈఎస్) కి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.60 కోట్లు కేటాయించింది. వైఈఎస్ పథకానికి సంబంధించిన విధివిధానాలను శనివారం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్‌కు (గిరిజన ఆర్థిక సహకార సంస్థ)కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 543.45 కోట్లు కేటాయించింది. అందులోంచి వైఈఎస్కు రూ.60 కోట్లు ఇచ్చింది. ఎరుకల సామాజిక వర్గానికి ఈ పథకం ద్వారా నవీన మార్గాన్ని చూపినట్టు అయిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో 1.44 లక్షలు ఉన్న ఎరుకల జనాభా (గిరిజన జనాభాలో ఎరుకలు 4.54 శాతం)ను సైతం సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 5 వేలు అంతకంటే ఎకువ ఎరుకుల జనాభా రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, సూర్యాపేట, హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి తదితర 13 జిల్లాల్లో ఉన్నారు. ఎరుకుల తెగ సంప్రదాయ వృత్తి పందుల పెంపకం, బుట్టలు అల్లడం, ఎరుక చెప్పడం, చీపుర్ల తయారీ. పందుల పెంపకం తరాలుగా జీవనోపాధిగా వస్తున్నది.
ఎరుకల తెగ సంప్రదాయ పందుల పెంపకంలో స్థల పరిమితులు, శాస్త్రీయ పద్ధతులను సరిగా ఉపయోగించకపోవడం, మున్సిపాలిటీ ల్లో చట్టపరమైన అసమ్మతి కారణంగా అనేక సవాళ్లను ఎదురొంటున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పందుల పెంపకం, ప్రాసెసింగ్, అదనపు విలువ జోడింపు, మారెటింగ్ సమగ్ర అభివృద్ధి కోసం కొత్త పందుల పెంపకం విధానాన్ని అమలు చేయటానికి 2022లో పశుసంవర్ధకశాఖ, పీవీ నరసింహారావు వెటర్న రీ యూనివర్సిటీ, ఐసీఏఆర్ (నేషనల్ రిసెర్చ్ సెంటర్) సం యుక్త ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనాన్ని చేపట్టాలని ఆదేశించింది. ఆ అధ్యయన నివేదిక అందిన వెంటనే ఎరుకల సాధికారత పథకానికి (వైఈఎస్) రూపకల్పన చేసింది. ఈ పథకాన్ని మెదక్ జిల్లాలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు.
పందుల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పందుల పెంపకం విధానాన్ని రూపొందించింది. పందుల పెంపకం, కబేలాల ఏర్పాటు, మాంసం ప్రాసెసింగ్, మారెటింగ్, అదనపు విలువజోడింపు కోసం మౌలిక సదుపాయాల కల్పనకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు 6,359 మంది ఎరుకల సభ్యులతో 137 ప్రాథమిక పందుల పెంపకం సంఘాలు ఏర్పాటు చేసింది. వైఈఎస్ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో పందుల పెంపకానికి మూడు రకాలుగా అండగా నిలిచేందుకు కమ్యూనిటీ-లెవెల్ మౌలిక వసతులు సృష్టించేందుకు చర్యలు తీసుకున్నది.
సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బ్యాంకు రుణ అంగీకార పత్రం, సొసైటీ తీర్మానం, గ్రామ/మున్సిపాలిటీ నిరభ్యంతర పత్రం, భూయాజమాన్య/ లీజు పత్రాలు, బ్యాంకు ఖాతా పాస్‌బుక్.
కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ యూనిట్‌కు అర్హులను ఎంపిక చేస్తుంది. జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్/ పంచాయతీ అధికారి, జిల్లా పశుసంవర్దక, పరిశ్రమల శాఖ అధికారులు, లీడ్ బ్యాంక్, జిల్లా మార్కెటింగ్ మేనేజర్లు ఉంటారు.
రాష్ట్రస్థాయి కమిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ/ గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీ చైర్మన్‌గా, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్/ ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ కో-కన్వీనర్‌గా, సభ్యులుగా పశుసంవర్ధకశాఖ డైరెక్టర్, పరిశ్రమల శాఖ కమిషనర్, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, నాబార్డు సీజీఎం ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్, ఐసీఏఆర్ డైరెక్టర్ ఉంటారు.
ప్రాథమిక : వాతావరణ నిరోధక పందుల పెంపకం యూనిట్.
ద్వితీయ : స్లాటర్ హౌస్,కోల్డ్ స్టోరేజీ, ప్యాకేజింగ్ యూనిట్ ఫ్రీజర్లతో కూడిన రవాణా వాహనం
తృతీయ : మాంసం ఉత్పత్తుల తయారీ కేంద్రాలు,రిటైల్ మారెటింగ్ అవుట్‌లెట్స్