సుల్తానాబాద్ రూరల్/ సుల్తానాబాద్/ దహెగాం, జూన్ 14: ఓ దుర్గార్ముడి కామదాహానికి అభంశుభం తెలియని ఆరేండ్ల బాలిక అసువులుబాసింది. నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడిచేసి హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా దహెగాంకు చెందిన దంపతులు నెల క్రితం బతుకుదెరువు కోసం ఇద్దరు బిడ్డలతో కలిసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి వచ్చి రైస్‌మిల్లులో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి వీరు నిద్రిస్తుండగా పక్క రైస్‌మిల్లులో పనిచేసే బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన వినోద్ (రాజ్‌కుమార్) రాత్రి 11 గంటల తర్వాత కూతురు(6)ను ఎత్తుకుపోయి, చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేసి హతమార్చాడు. అర్ధరాత్రి తల్లికి మెలకువ వచ్చి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. తోటి కార్మికులతో కలిసి గాలించగా, చెట్ల పొదల్లో చిన్నారి విగతజీవిగా కనిపించింది. రైస్‌మిల్లులోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, నిందితుడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారు జామున పెద్దపల్లి డీసీపీ చైతన్య, ఏసీపీ కృష్ణ, పెద్దపల్లి సీఐ సుబ్బారెడ్డి, సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కో సం సుల్తానాబాద్ దవాఖానకు తరలించారు. బిడ్డపై ఇంతటి ఘోరం జరగడంతో తల్లిదండ్రు లు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. నిందితు డిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.
దహెగాంలో విషాదం
బాలిక మరణంతో దహెగాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి అన్యా యం మరేబిడ్డకు జరగవద్దని, దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఆరెకుల సంక్షేమ సంఘం నాయకులు దహెగాం తహసీల్దార్, ఎస్ఐని కలిసి నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని , మిల్లు యాజమానులపైనా చట్టపరంగా చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఆత్మకు శాంతి కలగాలని మండలకేంద్రంలో యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ‘కామాంధుడికి ఉరే సరి’అని నినాదాలతో హోరెత్తించారు. అంగడిబజార్‌లో చిన్నారి చిత్రపటానికి నివాళులర్పించారు.
కామాంధుడిని శిక్షించాలని రాస్తారోకో
చిన్నారిని పొట్టనబెట్టుకున్న కామాంధుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, బంధువులు సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. వీరికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.