ఏరో సిటీలో సీఐఐ యూనివర్సిటీ
ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు
రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆరు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు రానున్నాయి. వీటి ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు చాలా డిమాండ్ ఉన్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆరు ప్రైవేట్ యూనివర్సిటీలలో నిక్మార్, అమిటీ, సీఐఐ, గురునానక్, ఎంఎన్ఆర్, కావేరీ యూనివర్సిటీలున్నాయని తెలిపారు.
కావేరీ వ్యవసాయ యూనివర్సిటీని కావేరి, గంగాకావేరీ సీడ్స్ సంస్థలు ఏర్పాటుచేస్తాయని చెప్పారు. జీఎమ్మార్ భాగస్వామ్యంతో సీఐఐ ఏరోసిటీలో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించామని వివరించారు. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటిదని తెలిపారు. ఫార్మా వర్సిటీ ఏర్పాటుపై ఫార్మా సొసైటీ హర్షం వ్యక్తంచేసింది.