Kishan Reddy | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పదవి కట్టబెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యవహారం. ఆ పదవి ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేంద్రం ఒకటి చెప్తే.. ఆయన మరొకటి చెప్తూ నవ్వులపాలు అవుతున్నారు. సోమవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.6 లక్షల కోట్లంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. తెలంగాణ అప్పును కిషన్రెడ్డి వాస్తవానికి భిన్నంగా దాదాపు రెండింతలు చేసి చెప్పడంపై ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. కేంద్రం లోక్సభలో జూలై 24న దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అప్పుల గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం తెలంగాణ అప్పు రూ.3,66,306 కోట్లు. కానీ కిషన్రెడ్డి మాత్రం దాదాపు డబుల్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. అబద్ధం ఎవరు చెప్తున్నారో ఆయనే ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
కంపెనీల అమ్మకంపై మౌనం ఎందుకు?
రాష్ట్ర ప్రభుత్వం రుణంగా సేకరించినా, భూముల అమ్మకాల ద్వారా సేకరించినా ప్రతి రూపాయీ ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ వేలంలో భూముల విలువ రికార్డు స్థాయిలో రూ.100 కోట్ల వరకు పలుకుతున్నది. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం భూములు అమ్మితే కిషన్రెడ్డి ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా అమ్మకాలకు మద్దతు తెలిపిన కిషన్రెడ్డి.. రాష్ట్రంలో వితండవాదన చేయడాన్ని తప్పుబడుతున్నారు. భూముల కేటాయింపుపై కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా మండిపడుతున్నారు. ములుగు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 335 ఎకరాలు కేటాయిస్తే ఇంతవరకు ఎందుకు వర్సిటీ ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.