Stumped | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వీరిలో 34 మందికి రుయా, స్వీమ్స్ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠద్వార దర్శనం టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీచేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు.
భక్తులను బైరాగిపట్టెడ వద్ద పద్మావతి పార్కులో ఉంచారు. టోకెన్ల కేంద్రంలోని సిబ్బందిలోని ఒకరు అస్వస్థతకు గురికావడంతో దవాఖానకు తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకెన్లు జారీ చేసేందుకే క్యూలైన్ తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. తమిళనాడు సేలంకు చెందిన మహిళ విష్ణు నివాసం వద్ద టోకెన్లు తీసుకునేందుకు ప్రయత్నించారు. భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. గాయపడిన మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి రుయా దవాఖానకు తరలిస్తుండగా మర్గమధ్యంలో మృతిచెందారు. మిగిలిన క్షతగాత్రులను సిమ్స్, రుయాకు తరలించారు. రుయాలో చికిత్సపొందుతూ మరో ఐదుగురు భక్తులు మృతిచెందారు.
అంచనా వేయడంలో టీటీడీ విఫలం
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టోకెన్ల కోసం వచ్చే భక్తులను అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలం చెందింది. ఎంతమంది భక్తులు వస్తారు? వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే విషయంలో జాగ్రత్తలు తీసుకొలేదనే విమర్శలొస్తున్నాయి. భద్రత విషయంలో విఫలమైననట్టు ఆరోపణలున్నాయి. పద్మావతి పార్కు నుంచి క్యూలైన్లోకి భక్తులను ఒక్కసారిగా వదలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు విమర్శిస్తున్నారు.
అంబులెన్స్‌ల కొరత
క్షతగాత్రులను సకాలంలో దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు టీటీడీ అధికారులపై మండిపడ్డారు. వైద్య సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే ముగ్గురు మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను రుయా దవాఖానకు తరలించగా, వైద్యులు పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో క్షతగాత్రులను బంధువులు స్విమ్స్‌కు తరలించారు.
సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలం!
ఉచిత దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు తరలివస్తారని సమాచారం ఉన్నా, ఏర్పాట్లు చేయడంలో టీటీడీ వైఫల్యం చెందిందని భక్తులు మండిపడుతున్నారు. భారీగా భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకోవడంతో మంగళవారం రాత్రి 12 గంటలకు ముందుగానే టోకెన్లు ఇచ్చే అవకాశాలున్నాయని భక్తులు తోసుకొచ్చారు. షామియానా కూడా ఏర్పాటు చేయకపోవడంతో చలికి వృద్ధులు, పిల్లలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
తొక్కిసలాట ఘటన దురదృష్టకరం : కేటీఆర్
తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తిరుపతి ఘటన బాధాకరం: హరీశ్‌రావు
తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం.. దురదృష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మరణించిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరం: కవిత
తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
మోదీ, బాబు దిగ్భ్రాంతి
తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఘటనాస్థలంలో సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు ; తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడి
హైదరాబాద్, జనవరి 8 (నమస్తేతెలంగాణ): వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలోని ఉత్తర ద్వారం దర్శనాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. జనవరి 10 నుంచి 19 వరకు సుమారు 7 లక్షల మందికి ఉత్తర ద్వారదర్శనం టికెట్లను ఆన్ విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. 9న ఉదయం 5 గంటల నుంచి తిరుమలలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వ దర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ప్రధాన ఆలయంతోపాటు తిరుమల పరిసర ప్రాంతాలను టీటీడీ సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 12 వేల వాహనాలను పారింగ్ చేసేలా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటుచేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 3వేల మంది పోలీసులు, 1,550 మంది విజిలెన్స్ సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.