హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, మోకిలలోని విల్లాల్లోకి భారీగా వరద నీరు చేరింది. సుమారు 200 విల్లాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులోకి పెద్దఎత్తున నీరు వచ్చింది. వరద ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాలు నిర్మించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలులేకపోవడంతోనే విల్లాల్లోకి నీరు చేరిందని, ప్రతియేటా వానకాలంలో ఇది సర్వసాధారమైందని పేర్కొంటున్నారు. సుమారు రూ.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విల్లాలు నీట మునగడంతో బాధితుల బాధ వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం స్పందించి భవిష్యత్తులో విల్లాల్లోకి వరద రాకుండా చర్యలు తీసుకోవాలని విల్లాలవాసులు కోరుతున్నారు.